Puja Khdekar: ముగిసిన డెడ్‌లైన్.. ఐఏఎస్ శిక్షణ కేంద్రానికి పూజా ఖేద్కర్ డుమ్మా
- పలు వివాదాల్లో చిక్కుకున్న ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్
- శిక్షణ నిలిపివేసి 23న ముస్సోరీ శిక్షణ కేంద్రంలో రిపోర్టు చేయాలని ఆదేశం
- నకిలీ ధ్రువీకరణ పత్రాలపై కేసు నమోదు చేసిన ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు
- ధ్రువపత్రాలు పరిశీలించేందుకు ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిన కేంద్రం
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ డెడ్ లైన్ ముగిసినప్పటికీ శిక్షణ కేంద్రానికి చేరుకోకపోవడం మరోమారు చర్చనీయాంశమైంది. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అడ్మినిస్ట్రేషన్ అకాడమీ (ఎల్బీఎస్ఎన్ఏఏ)లో నిన్ననే రిపోర్ట్ చేయాల్సి ఉండగా ఆమె హాజరుకాలేదు.
నకిలీ డిజేబులిటీ, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె సెలక్షన్ చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ట్రైనింగ్‌ను నిలిపివేసిన ప్రభుత్వం ఈ నెల 23న ముస్సోరి శిక్షణ కేంద్రంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ ఆమె ఆ ఆదేశాలను పట్టించుకోలేదు.
మరోవైపు, తన గుర్తింపునకు సంబంధించి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై ఢిల్లీ పోలీస్ క్రైంబ్రాంచ్ కేసు నమోదు చేసింది. ఖేద్కర్ సమర్పించిన డాక్యుమెంట్ల పరిశీలన కోసం కేంద్రం ఏకసభ్య కమిటీని నియమించింది.