BJP: జగన్ ప్రభుత్వ రాక్షస క్రీడ వల్ల పదేళ్లు గడిచినా ఏపీకి రాజధాని లేని పరిస్థితి: మంత్రి సత్యకుమార్

Minister Satya Kumar lashes out at previouse jagan government

  • రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రయత్నాలు వైసీపీ చేయలేదని విమర్శ
  • అమరావతిని వైసీపీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిందని మండిపాటు
  • వైసీపీ తీరు ఏపీకి తీరని నష్టాన్ని మిగిల్చిందన్న సత్యకుమార్

మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రభుత్వం చేసిన వికృత రాక్షస క్రీడ ఫలితంగా పదేళ్లు గడిచినా రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందని ఏపీ మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ప్రధాని మోదీకి సత్యకుమార్ మంగళవారం ఓ లేఖ రాశారు. ఐదేళ్ల విధ్వంస సంకెళ్లను ఏపీ తెంచుకుని... ఇప్పుడు అభివృద్ధి పయనంలో సాగుతోందన్నారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రయత్నాలు వైసీపీ చేయలేదన్నారు. ఫలితంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో దాదాపు ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.

రాజధాని అమరావతిని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం ద్వారా ఏపీకి వైసీపీ దారుణ నష్టాన్ని మిగిల్చిందన్నారు. అమరావతి అభివృద్ధి కోసం 2014 నుంచి 2019 వరకు రూ.10,000 కోట్లకు పైగా ఖర్చు చేయడంతో చాలా భవనాలు, నిర్మాణాలు అభివృద్ధి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కానీ వీటిని వైసీపీ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచిందని, ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో, ప్రజల అభివృద్ధి ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్లడానికి ఇటు ఏపీలో, అటు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు మళ్లీ అధికారంలోకి వచ్చాయన్నారు.

అందులో భాగంగానే అమరావతి అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.15 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారన్నారు. అవసరమైనప్పుడు మరింత సాయానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించిందని గుర్తు చేశారు. రాజధానిని త్వరితగతిన అభివృద్ధి చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. త్వరితగతిన రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కేంద్రం ప్రదర్శించిన నిబద్ధతకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News