NEET-UG Paper Leak Row: నీట్ పేపర్ లీక్ పై మేం చెప్పిందే ఇవాళ సుప్రీంకోర్టు కూడా చెప్పింది: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- దేశంలో నీట్ యూజీ ఎంట్రన్స్ పేపర్ లీక్
- కొద్ది స్థాయిలోనే లీక్ అయిందన్న సుప్రీంకోర్టు
- మళ్లీ పరీక్ష జరపాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
- సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి
నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయింది వాస్తవమేనని, అయితే చాలా కొద్ది స్థాయిలోనే లీక్ కావడం వల్ల, మళ్లీ నీట్ పరీక్ష జరపాల్సిన అవసరం లేదని ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.
నీట్ పేపర్ లీక్ పరిమితి స్థాయిలోనే జరిగిందని తాము మొదటి నుంచి చెబుతున్నామని, తాము ఎప్పటి నుంచో చెబుతున్నదే ఇవాళ సుప్రీం కోర్టు కూడా చెప్పిందని అన్నారు. అయితే, నీట్ పేపర్ లీక్ అంశంపై విపక్షాలు అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. సత్యమే గెలిచిందని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొనడం హర్షణీయమని తెలిపారు.
ఇక, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో, మరో రెండ్రోజుల్లో నీట్ యూజీ ఫలితాలను ఎన్టీయే విడుదల చేస్తుందని వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానం పరిశీలించిన మేరకు నీట్ యూజీ మెరిట్ లిస్టును సవరిస్తామని వివరించారు.