KTR: బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం: కేటీఆర్

KTR fires at union budget

  • తెలుగు కోడలు తెలంగాణకు నిధులు కేటాయిస్తారని ఆశించామన్న కేటీఆర్
  • తెలంగాణకు మరోసారి గుండు సున్నా దక్కిందన్న మాజీ మంత్రి
  • కాంగ్రెస్, బీజేపీకి 16 సీట్లు ఇస్తే ఇచ్చిందేమీ లేదని విమర్శ
  • ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తే ఏపీ, తెలంగాణకు అధిక నిధులు వచ్చాయన్న కేటీఆర్
  • తెలంగాణ ప్రజలు ఈ విషయం ఆలోచించాలని సూచన

బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించామని, కానీ దక్కింది శూన్యమన్నారు. ఇంత పెద్ద బడ్జెట్‌లో కేవలం కొన్ని రాష్ట్రాలకే పెద్దపీట వేశారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది గుండుసున్నానే అన్నారు.

పునర్విజన చట్టంలో దాదాపు 35 హామీలపై నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. నిధులు అభ్యర్థిస్తూ కేసీఆర్ అనేకసార్లు లేఖలు కూడా రాశారన్నారు. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఐఐఎం సహా వివిధ కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని తాము కోరినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు.

తెలంగాణ నుంచి ముంబై-నాగపూర్, బెంగళూరు-చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్లకు నిధులు అడిగినప్పటికీ వాటి గురించి స్పందన లేదని మండిపడ్డారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్‌తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినప్పటికీ కేంద్రం స్పందించలేదన్నారు. తెలంగాణ సీఎం, మంత్రులు వెళ్లి ఢిల్లీలో అడిగినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో మరోసారి గుండు సున్నా దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో 16 స్థానాలను బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని సూచించారు. అదే 16 స్థానాలున్న ఏపీకి, బీహార్‌కు దక్కిన నిధులు చూసి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేసుకోవాలో మరోసారి ఈ బ‌డ్జెట్ తెలియజేస్తోంద‌న్నారు.

బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు పార్లమెంట్‌లో ఒక్క మాటా మాట్లాడలేదని విమర్శించారు. సభలో కూర్చున్న ఎంపీలు కనుక గులాబీ కండువా కప్పుకొని ఉంటే... కచ్చితంగా నిలదీసేవాళ్లమన్నారు. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా బీజేపీ ఇచ్చింది గుండు సున్నా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన చట్టం పేరు చెప్పిన ప్రతిసారి ఎక్కడా తెలంగాణ అనే పదం ప్రస్తావించలేదన్నారు. ఏపీకి నిధులు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఇవ్వలేదన్నారు. ఏపీకి భారీ నిధులు ఇవ్వడం పట్ల తమకు ఎలాంటి దుగ్ధ లేదు... కానీ తెలంగాణ మాటేమిటని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News