Vijayasai Reddy: రూ.15 వేల కోట్లకు సంతృప్తిపడి బంగారం లాంటి అవవకాశాన్ని మట్టిపాలు చేశారు: టీడీపీపై విజయసాయిరెడ్డి విమర్శలు

Vijayasai Reddy slams TDP leaders on budget


కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెదవి విరిచారు. రూ.15 వేల కోట్లకు సంతృప్తి పడిన టీడీపీ బంగారం లాంటి అవకాశాన్ని మట్టిపాలు చేసిందని విమర్శించారు. అది కూడా ఏపీకి ప్రకటించిన ఆ రూ.15 వేల కోట్లు సర్దుబాటు చేస్తామన్నారని, దానర్థం అవి అప్పు రూపంలో ఇచ్చే నిధులు అని స్పష్టం చేశారు. 

కానీ బీహార్ కు రూ.26 వేల కోట్లు ఇవ్వడం కేటాయింపు కిందికి వస్తుందని... సర్దుబాటుకు, కేటాయింపుకు తేడా ఉందని విజయసాయిరెడ్డి వివరించారు. తెలుగుదేశం పార్టీ  నుంచి ఇలాంటివి ఊహించినవేనని పేర్కొన్నారు. 

"కేంద్రం తన మనుగడ కోసం ఏదో ఒకనాడు ఏపీ ఎంపీలపై ఆధారపడే పరిస్థితి రావాలన్నది జగన్ కల. కానీ ఇవాళ కూటమి ఎంపీలు ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు... ఎంత సిగ్గుచేటు! అమరావతి నిర్మాణానికి రూ.1.5 లక్షల కోట్లు కావాల్సి ఉంటే... కేంద్రం దాదాపు ఏమీ ఇవ్వనట్టే లెక్క... టీడీపీ దానికి కూడా సంతృప్తిపడింది.

టీడీపీకి బీజేపీతో క్విడ్ ప్రో కో ఉంది. కేంద్రంలో తాము ఇచ్చే మద్దతుకు ప్రతిఫలంగా... ఏపీ ఫైబర్ నెట్ స్కాం, ఏపీ సీఆర్డీయే స్కాం, రింగ్ రోడ్ స్కాంలలో తమ నేతలు విచారణ ఎదుర్కోకుండా కేంద్రం నుంచి రక్షణ పొందుతోంది. ఈ సర్దుబాటుకు ఏపీ ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. 

పైగా ఈ మాత్రం దానికి కేంద్రానికి టీడీపీ వాళ్లు కృతజ్ఞతలు కూడా చెబుతున్నారు... కృతజ్ఞతలు చెప్పడం ఎందుకు? ఇవాళ కేంద్రం ఇచ్చినవన్నీ రాష్ట్ర పునర్ విభజన చట్టంలో పేర్కొన్నవే. దేనికీ కూడా బడ్జెట్ ద్వారా కేటాయింపులు చేయలేదు" అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Vijayasai Reddy
Budget
YSRCP
TDP
  • Loading...

More Telugu News