Gautam Gambhir: గంభీర్ ఆన్ డ్యూటీ... టీమిండియా కోచ్ గా పని ప్రారంభం

Team India coach Gambhir on duty

  • టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ 
  • శ్రీలంక పర్యటనతో కోచ్ గా గంభీర్ ప్రస్థానం ప్రారంభం
  • జులై 27 నుంచి టీమిండియా-శ్రీలంక టీ20 సిరీస్
  • ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్

గతంలో టీమిండియాకు అనేకమంది కోచ్ లు గా పనిచేశారు కానీ, గౌతమ్ గంభీర్ కు వచ్చినంత హైప్ మరెవరికీ రాలేదు. భారత క్రికెట్ చరిత్రలో జట్టు కంటే కోచ్ ను హైలైట్ చేసి చూపిస్తుండడం గంభీర్ తోనే మొదలైందని చెప్పాలి. రాహుల్ ద్రావిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తో ముగియడంతో, టీమిండియా నూతన్ కోచ్ గా గౌతీ నియమితుడయ్యాడు. 

శ్రీలంక పర్యటనతో టీమిండియా కోచ్ గా గంభీర్ ప్రస్థానం ప్రారంభం అవుతోంది. నిన్ననే శ్రీలంక చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు నేడు మైదానంలో ప్రాక్టీస్ షురూ చేశారు. కోచ్ గా మైదానంలో అడుగుపెట్టిన గంభీర్ ఆటగాళ్ల సాధనను నిశితంగా పరిశీలిస్తూ, వారికి తగిన సూచనలు ఇస్తూ బిజీగా కనిపించాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న గంభీర్... టీమిండియా ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ, వారితో ప్రాక్టీసు చేయించాడు. 

ఈ ఏడాది ఐపీఎల్ లో గంభీర్ మెంటార్ గా వ్యవహరించిన కోల్ కతా నైట్ రైడర్స్ తిరుగులేని విజయాలతో సీజన్ చాంపియన్ గా నిలిచింది. దాంతో గౌతీ మార్గదర్శకత్వంపై అందరిలో ఓ విశ్వాసం ఏర్పడింది. ముఖ్యంగా, బీసీసీఐ కార్యదర్శి జై షా పట్టుబట్టి మరీ గంభీర్ ను టీమిండియా కోచ్ గా పనిచేసేందుకు ఒప్పించారు. 

ఇక, శ్రీలంక పర్యటనలో టీమిండియా మొదట టీ20 సిరీస్, ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది. జులై 27 నుంచి టీ20లు, ఆగస్టు 2 నుంచి వన్డేలు జరగనున్నాయి.

Gautam Gambhir
Coach
Team India
Sri Lanka

More Telugu News