Chandrababu: రుషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారో తెలియడంలేదు: సీఎం చంద్రబాబు

CM Chandrababu speech in assembly session

  • కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • నేరస్తుడు సీఎం అయితే ఎలా ఉంటుందో చూశామన్న చంద్రబాబు
  • ఒక వ్యక్తి ధనదాహం వల్ల ఎక్కడ చూసినా అవినీతి నెలకొందని విమర్శలు

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో చూశామని అన్నారు. పోలీసులు కూడా అలాంటి నేరస్తుడికి సహకరించారని ఆరోపించారు. ఆ నేరస్తుడి పాలనలో సీబీఐ వాళ్లు కూడా అరెస్ట్ చేయలేక వెనక్కి వచ్చారని వెల్లడించారు. కోడికత్తి డ్రామా చూశాం, గులకరాయి డ్రామా చూశాం... కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ, గులకరాయి డ్రామా పనిచేయలేదని చంద్రబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. 

"ఒక వ్యక్తి ధనదాహం వల్ల ఎక్కడ చూసినా అవినీతి నెలకొంది. ధనదాహంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దోచేశారు. అన్ని రంగాల్లో దోపిడీకి పాల్పడ్డారు. లక్షల కోట్లు దోచుకున్నారు. ఒక్క మైనింగ్ లోనే రూ.20 వేల కోట్లు దోచుకున్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. అవినీతి డబ్బును రాష్ట్రమంతా పంచారు. 

అసమర్థ నిర్ణయాలతో రాష్ట్రం ధ్వంసమైంది. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధికి దూరం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారు. రుషికొండ ప్యాలెస్ ఎందుకు కట్టారో తెలియడంలేదు. ప్యాలెస్ ను టూరిజం కోసం ఇవ్వాలని కొందరు అంటున్నారు. నాడు ప్రజావేదిక కూల్చారు... ఆ శకలాలను కూడా తొలగించలేదు. 

పులివెందుల మాదిరి రాష్ట్రాన్ని తయారుచేద్దామనుకున్నారు. పైశాచిక ఘటనలకు పాల్పడతారు... తిరిగి ఆ నేరం మనపైనే వేస్తారు. బాధితులనే నిందితులుగా చేసిన ఘనత వైసీపీది. వివేకా హత్య కేసు ఎన్ని మలుపులు తిరిగిందో చూశాం. సీబీఐ వాళ్లు కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించింది. హూ కిల్డ్ బాబాయ్? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం వస్తుంది. 

రాష్ట్రంలో హింసకు తావులేదు... తప్పు చేసిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. ఇకపై రాష్ట్రంలో నేరస్తుల ఆటలు సాగవు. వ్యక్తిగత గొడవలను జగన్ రాజకీయం చేద్దామనుకున్నారు. అందుకే అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్లారు. 

నాడు సభలో నన్ను అవమానించారు. నాకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టారు. కానీ ప్రజాక్షేత్రంలో మళ్లీ గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టాం. వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ విపరీతంగా విస్తరించాయి. డ్రగ్స్, గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తాం. రాష్ట్రంలో నేరాలు చేయాలనుకుంటే ఊరుకునేది లేదు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. 

ఎంతో వెనక్కి వెళ్లిపోయిన రాష్ట్రాన్ని పునర్ నిర్మించే బాధ్యత మాది. ఇటుక ఇటుక పేర్చుకుంటూ వస్తున్నాం. ప్రజలు మాపై పెట్టుకున్న ఆశలను తప్పకుండా నెరవేర్చుతాం. రాజధాని అమరావతి నిర్మాణం కచ్చితంగా పూర్తవుతుంది. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నదే నా లక్ష్యం... తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలనేదే నా ఆకాంక్ష. సూపర్-6 అమలులో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకంజ వేసేది లేదు.

త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రవేశపెడతాం. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో 100 వరకు అన్న క్యాంటీన్లు నడిచేలా చూస్తాం. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను దుర్మార్గంగా తీసుకువచ్చారు. ఒక దుర్మార్గుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో చెప్పడానికి ఈ చట్టమే ఉదాహరణ" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

More Telugu News