Narendra Modi: అభివృద్ధి చెందిన దేశానికి పునాది వేసే బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ

PM Narendra Modi said the Union Budget 2024 will lay the foundation for a developed India

  • కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు
  • అన్ని వర్గాల ప్రయోజనం చేకూర్చే బడ్జెట్‌గా అభివర్ణన
  • మధ్య తరగతి జీవుల సాధికారతకు దోహదపడుతుందని విశ్వాసం
  • విద్య, నైపుణ్య ప్రమాణాలను పెంచుతుందని ఆశాభావం
  • నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మోదీ స్పందన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ (మంగళవారం) లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూర్చుతుందని, అభివృద్ధి చెందిన దేశానికి పునాది వేస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్య తరగతి జీవుల సాధికారతకు దోహదపడుతుందని, ఉద్యోగాల కల్పనకు అపూర్వమైన ప్రోత్సాహకాన్ని ఇస్తుందని అభిలషించారు. బడ్జెట్ కేటాయింపులతో గ్రామీణ, పేదలు, రైతులు లబ్దిపొందుతారని అన్నారు. విద్య, నైపుణ్యాల ప్రమాణాలను పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ యువతకు కొత్త మార్గాలను చూపుతుందని అన్నారు. ఇక మధ్యతరగతి జీవులకు కొత్త బలాన్ని ఇస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ బడ్జెట్ మహిళా కేంద్రీకృతమైదని, మహిళల సారధ్యంలో అభివృద్ధికి, శ్రామికశక్తిలో మహిళలను మరింత భాగస్వామ్యం చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని అన్నారు. అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిన బడ్జెట్ ఇది అని, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచిందని అన్నారు.

ఆర్థిక వృద్ధికి దోహదం..
రానున్న కొన్నేళ్ల వ్యవధిలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేలా ఈ బడ్జెట్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కొత్త పన్ను విధానంలో నిబంధనలను సడలించడం ద్వారా పన్ను భారం తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అంతరిక్ష రంగ అభివృద్ధికి రూ.1,000 కోట్లు కేటాయించామని మోదీ ప్రస్తావించారు. కొత్త ఆవిష్కరణలు, కొత్త స్టార్టప్‌ రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని ప్రస్తావించారు. నగరం, పట్టణం, గ్రామం, చివరిగా ఇంటి స్థాయిలో వ్యవస్థాపకులను సృష్టించాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, ప్రతి ఇంటిలో పారిశ్రామికవేత్తలు ఉద్భవించాల్సిన అవసరం ఉందని తాము భావిస్తున్నట్టు మోదీ వివరించారు. భారతదేశాన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని, ఈ లక్ష్యాలకు బడ్జెట్ బాటలు వేస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

More Telugu News