NTR Health University: విజయవాడలో హెల్త్ వర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు... అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం
- గతంలో ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసిన వైసీపీ సర్కారు
- వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టిన వైనం
- వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణకు నేడు అసెంబ్లీలో బిల్లు
- ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సభ్యులు
విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి గత ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టడం తెలిసిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా, తాజాగా, ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించారు.
దీనికి సంబంధించిన బిల్లును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టాలన్న ఆ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. దాంతో, సభ్యులు బల్లలపై చరుస్తూ హర్షం వెలిబుచ్చారు.
విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చుతూ జగన్ ప్రభుత్వం 2022లో నిర్ణయం తీసుకుంది. నాడు సర్కారు తీర్మానం చేయగా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు.
గవర్నర్ ఆమోదం తెలపడంతో, ఆ బిల్లును చట్టంగా మార్చిన నాటి వైసీపీ ప్రభుత్వం ఆ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో టీడీపీ నేతలు చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులు భగ్గుమన్నారు. జనసేనాని పవన్ కల్యాణ్, సీపీఐ రామకృష్ణ కూడా ఆరోగ్య వర్సిటీ పేరు మార్పుపై నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.