Canada: కెనడాలోని హిందూ దేవాలయం గోడలపై మరోసారి భారత వ్యతిరేక రాతలు
- దేవాలయం గోడలపై నినాదాలతో అపవిత్రం చేసిన దుండగులు
- ఘటనను తీవ్రంగా ఖండించిన కెనడా విశ్వహిందూ పరిషత్
- శాంతిని పెంపొందించే హిందూ సమాజంపై కొంతమంది రెచ్చిపోతున్నారని మండిపాటు
కెనడాలోని ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయాన్ని కొందరు దుండగులు అపవిత్రం చేశారు. దేవాలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. ఈ ఘటనను కెనడా విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. పెరుగుతున్న అతివాద భావజాలానికి వ్యతిరేకంగా కెనడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
'కెనడా ఎడ్మంటన్‌లోని బాప్స్ స్వామినారాయణ మందిరంలో హిందూ ఫోబిక్ తీవ్రవాద విధ్వంసక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం' అని కెనడా విశ్వహిందూ పరిషత్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. శాంతిని పెంపొందించే హిందూ సమాజంపై కొంతమంది తీవ్రవాద భావజాలంతో రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఖలిస్థానీ వేర్పాటువాదులు ఇలా ఆలయాన్ని ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోను పలుమార్లు ఆలయాల గోడలపై భారత వ్యతిరేక నినాదాలు రాశారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం తర్వాత కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారుల భారత వ్యతిరేక కార్యకలాపాలు హెచ్చుమీరాయి.