AP Police: జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగాయో చెప్పిన ఏపీ పోలీస్ శాఖ
- ఏపీలో 31 రాజకీయ హత్యలు జరిగాయన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
- పార్లమెంటులో ఎండగడతామని వెల్లడి
- మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై గణాంకాలతో స్పందించిన పోలీస్ శాఖ
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, 31 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలిసిందే. ఏపీలో రాజకీయ కక్షలతో జరుగుతున్న దాడులను తాము పార్లమెంటులో ప్రస్తావిస్తామని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని దేశం మొత్తానికి వివరిస్తామని మిథున్ రెడ్డి చెప్పారు.
అయితే, ఏపీలో 31 రాజకీయ హత్యలు జరిగాయన్న ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. జూన్ 4 నుంచి జులై 22 వరకు రాష్ట్రంలో రాజకీయ కారణాలతో జరిగిన హత్యలు 4 అని వెల్లడించింది. అందులో అనంతపురం జిల్లాలో 2, గుంటూరు జిల్లాలో 1, కర్నూలు జిల్లాలో 1 ఘటన జరిగాయని వివరించింది. మృతి చెందినవారిలో ముగ్గురు టీడీపీకి చెందినవారని, ఒకరు వైసీపీకి చెందినవారని పోలీస్ శాఖ స్పష్టం చేసింది.
ఇక, పాతకక్షలు, రాజకీయ విభేదాలతో ఆవేశపూరితంగా జరిగిన గొడవల్లో పల్నాడు జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 1 హత్య జరిగినట్టు వెల్లడించింది. మృతులు ఇద్దరూ వైసీపీకి చెందినవారని పేర్కొంది.