Kanwar Yatra: కావడి యాత్రపై యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

Supreme Court stays on Uttar Pradesh and Uttarakhand govt orders on Kanwar Yatra

  • ప్రతి ఏటా శ్రావణ మాసంలో శివభక్తుల కావడి యాత్ర
  • పవిత్ర గంగా జలాలు కావిళ్లలో స్వస్థలాలకు తరలింపు
  • వివాదాస్పద ఆదేశాలు జారీ చేసి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు
  • కావడి యాత్ర మార్గంలో హోటళ్ల వెలుపల యజమానుల పేర్లు ప్రదర్శించాలని స్పష్టీకరణ

ప్రతి సంవత్సరం శివ భక్తులు పవిత్ర గంగా నదీ జలాలను కావిళ్లపై మోసుకుంటూ స్వస్థలాలకు తీసుకెళుతుంటారు. ప్రతి ఏడాది ఈ కావడి యాత్రను శ్రావణ మాసంలో చేపడుతుంటారు. 

అయితే, కావడి యాత్ర సాగే మార్గంలో రోడ్డు పక్కన ఉండే హోటళ్లు, ధాబాలు, తోపుడు బళ్ల ముందు వాటి యజమానుల పేర్లు, వ్యక్తిగత వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలంటూ యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే, ఈ ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. 

ఇది భారత సంస్కృతిపై దాడి చేయడమేనంటూ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. సదరు హోటల్ లో ఏ ఆహారం దొరుకుతుందో బోర్డు పెడతారు కానీ, యజమాని పేరు, వ్యక్తిగత వివరాలు ఎవరూ ప్రదర్శించరని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

దీనిపై ఆయా రాష్ట్రాల పోలీసులు ఏమంటున్నారంటే... కావడి యాత్రలో పాల్గొనేవారు ఎక్కడ శాకాహారం దొరుకుతుందో సులభంగా గుర్తించేందుకే ఈ నిబంధన తీసుకువచ్చినట్టు చెబుతున్నారు. 

ఈ నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. 

పిటిషనర్లు తమ వాదనలు వినిపిస్తూ... మనం ఎక్కడైనా బయట భోజనం చేయడానికి వెళితే.. ఏం తినాలనుకుంటున్నామో దానికి సంబంధించిన వివరాలనే కోరుకుంటామని, ఎవరు మనకు వడ్డిస్తున్నారో తెలుసుకోవాలని ఎవరూ అనుకోరని తెలిపారు. వ్యక్తుల గుర్తింపును బట్టి వారిని దూరం పెట్టే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు ఇచ్చినట్టు స్పష్టమవుతోందని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. 

ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ స్పష్టం చేశారు. ఇలాంటి ఆదేశాలకు చట్టబద్ధత ఉండదని, ఇటువంటి ఆదేశాలు జారీ చేయాలని ఏ చట్టం చెబుతోందని మరో న్యాయవాది ప్రశ్నించారు. 

ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం... ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఎక్కడైనా గానీ హోటళ్ల వద్ద ఆహార పదార్థాల వివరాలను మాత్రమే ప్రదర్శిస్తారని, యజమానుల పేర్లు కూడా ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

More Telugu News