Gautam Gambhir: కోహ్లీతో విభేదాలపై తొలిసారి బహిరంగంగా స్పందించిన గౌతం గంభీర్
- కోహ్లీతో తన సంబంధం టీఆర్పీ రేటింగ్ కోసం కాదన్న గంభీర్
- తాము 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న కోచ్
- కోహ్లీ పూర్తి ప్రొఫెషనల్ అని ప్రశంసలు
- పాండ్యాను టీ20 కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పిన అగార్కర్
విరాట్ కోహ్లీతో తన సంబంధం టీఆర్పీ రేటింగ్ కోసం కాదని, ప్రస్తుతానికి తాము దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని టీమిండియా కొత్త కోచ్ గౌతం గంభీర్ స్పష్టం చేశాడు. తాము 140 కోట్ల మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని తెలిపాడు. మైదానం వెలుపల అతడితో తమకు అనుబంధం ఉందని తెలిపాడు. మ్యాచ్ సమయంలోనూ, ఆ తర్వాత అతడితో తాను ఎన్ని చాటింగ్‌లు చేశాననేది ముఖ్యం కాదని, అతడు పూర్తి ప్రొఫెషనల్ అని, ప్రపంచస్థాయి అథ్లెట్ అని ప్రశంసించాడు. మున్ముందు కూడా అతడు ఆ విధంగానే కొనసాగుతాడని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లో కోహ్లీతో విభేదాల నేపథ్యంలో గంభీర్ ఇలా స్పందించాడు.
బీసీసీఐ సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌తో కలిసి తొలిసారి ముంబైలో మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అజిత్ అగార్కర్ మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించడం వెనకున్న కారణాన్ని వెల్లడించాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సమస్యలకు తోడు అతడు ఎప్పుడు అందుబాటులో ఉంటాడన్న దానిపై స్పష్టత లేకపోవడం కూడా సూర్యకుమార్ యాదవ్ ఎంపికకు కారణమని పేర్కొన్నాడు.
తమకు అన్ని గేమ్స్ ఆడగల కెప్టెన్ కావాలని, కానీ పాండ్యా ఫిట్‌నెస్ సవాలుగా మారిందని పేర్కొన్నాడు. ఇది ఒక కోచ్‌కు, సెలక్టర్‌కు కష్టమవుతుందని చెప్పుకొచ్చాడు. అయినా తమకు టీ20 ప్రపంచకప్ వరకు సమయం ఉందని పేర్కొన్నాడు. తమకు తరచూ అందుబాటులో ఉండే ఆటగాడే కావాలని, కెప్టెన్‌గా విజయం సాధించడానికి అవసరమైన లక్షణాలు సూర్యలో ఎక్కువగా ఉన్నాయని తాము విశ్వసిస్తున్నట్టు వివరించాడు.