Projects: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నీటిమట్టాలు ఎలా ఉన్నాయంటే..?

Key Projects Water levels Position In Telugu States

  • రెండు రోజులుగా రెండు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు
  • ఉప్పొంగి ప్రవహిస్తున్న నదులు
  • ప్రాజెక్టుల్లోకి భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు

ఏపీ, తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ముంచెత్తిన వర్షానికి వరద నీరు తెలంగాణలోని ప్రాజెక్టులకు వచ్చి చేరుతోంది. దీంతో తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు పెరిగాయి. ఏ ప్రాజెక్టులో ఎంత నీరుందనే వివరాలు..

కృష్ణా నదిపై ఉన్న జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 318.5 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.5 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇన్ ఫ్లో 76 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నుంచి అధికారులు 84,236 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 813 అడుగులకు చేరింది. ప్రస్తుతం 82,396 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. ప్రాజెక్టు ఇప్పట్లో నిండుకునే సూచనలు కనిపించకపోవడంతో అధికారులు నీటిని కిందికి వదలడం లేదు.

నాగార్జున సాగర్.. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుత నీటిమట్టం కేవలం 123 టీఎంసీలు మాత్రమే. ఇన్ ఫ్లో 4,694 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 8,480 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.

ప్రకాశం బ్యారేజీ.. పంటకాలువలకు ఔట్ ఫ్లో 1,309 క్యూసెక్కులు కాగా 7,125 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులు..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1,091 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1,066 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి వరద నీరు 19 వేల క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు. ఔట్ ఫ్లో ఏమీలేదు.

మిడ్ మానేరు.. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 27.54 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం కేవలం 5.57 టీఎంసీలు మాత్రమే ఉంది. మిడ్ మానేరులోకి 236 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా, 62 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.

కిన్నెరసాని ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 402 అడుగులు. ప్రస్తుతం 2,800 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఔట్ ఫ్లో ఏమీలేదు. కాగా, భద్రాచలంలో గోదావరి నది ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా.. అంటే 33.5 అడుగులకు చేరుకుంది.

పోలవరం ప్రాజెక్టు.. స్పిల్ వే ఎగువ 30.6 మీటర్లు, స్పిల్ వే దిగువ 20.6 మీటర్లు, కాపర్ డ్యామ్ ఎగువ 30.3 మీటర్లు, కాపర్ డ్యామ్ దిగువ 20.15 మీటర్లు.. ప్రస్తుత ఔట్ ఫ్లో 5.87 క్యూసెక్కులు.




More Telugu News