Kolikapudi Srinivasa Rao: రోడ్డుపై గుంతలో కూర్చుని ఎమ్మెల్యే కొలికపూడి నిరసన

Kolikapudi Srinivasa Rao Protests On Road

  • తిరువూరు మున్సిపాలిటీ సమీపంలోని ప్రధాన రోడ్డుపై గుంత
  • సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన స్థానికులు
  • గుంతలో స్టూలు వేసుకుని కూర్చుని కొలికపూడి నిరసన
  • వర్షాకాలం పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులు చేస్తామన్న ఆర్అండ్‌బీ ఏఈ

రహదారిపై పడిన గుంతలను పూడ్చడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువూరు మున్సిపాలిటీ సమీపంలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలో స్టూల్‌పై కూర్చుని నిరసన తెలిపారు. ఇటీవల పడిన వర్షాలకు ఈ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఇలా నిరసన తెలిపారు. 

సమాచారం అందుకున్న ఆర్‌అండ్‌బీ ఏఈ గాయత్రి అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేతో మాట్లాడారు. రోడ్డు అభివృద్ధికి ప్రభుత్వం రూ. 1.96 కోట్లు మంజూరు చేసిందని, టెండరు పూర్తిచేసి జనవరిలోనే కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. అయితే, తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయని వివరించారు. వర్షాకాలం పూర్తయిన వెంటనే రహదారి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అయితే, కనీసం అప్పటి వరకు మరమ్మతు పనులైనా చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆమెకు సూచించిన ఎమ్మెల్యే నిరసన విరమించారు.
    

More Telugu News