Kinjarapu Ram Mohan Naidu: ఒక కొత్త పద్ధతిలో ఈ మీటింగ్ జరిగింది: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

Union minister Ram Mohan Naidu said today meeting held in a new style

  • ఎల్లుండి నుంచి పార్లమెంటు సమావేశాలు
  • టీడీపీ ఎంపీలతో పార్లమెంటరీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు
  • ఎంపీలందరికీ రాష్ట్రంలో, కేంద్రంలో ఒక్కో మంత్రిత్వ శాఖను కేటాయించారన్న రామ్మోహన్
  • ఎంపీలు రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య వారధుల్లా పనిచేస్తారని వెల్లడి

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, నేడు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బలంగా సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై ఒక కొత్త పద్ధతిలో నేటి సమావేశం జరిగిందని వెల్లడించారు. అందుకే, ఎప్పుడూ లేని విధంగా, ఎంపీల సమావేశానికి రాష్ట్ర మంత్రులను కూడా చంద్రబాబు ఆహ్వానించారని తెలిపారు. 

"కొత్త పద్ధతి ఏంటంటే... ఎంపీలందరికీ ఒక్కొక్కరికి రాష్ట్రంలోని ఒక మంత్రిత్వ శాఖను, కేంద్రంలోని ఒక మంత్రిత్వ శాఖను కేటాయించారు. తద్వారా రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య వారధులుగా పనిచేసే ఒక అదనపు బాధ్యతను ఎంపీలకు అప్పగించారు. ఆ బాధ్యతను మేం సక్రమంగా నిర్వర్తిస్తాం. 

అయితే, ఏపీని అప్పుల ఊబి నుంచి, కష్టాల నుంచి బయటికి తీసుకురావాలంటే కేంద్రం తాలూకు సహకారం తప్పనిసరి. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు, కేంద్రం పథకాలను కూడా సద్వినియోగం చేసుకోవడంపై టీడీపీ ఎంపీలందరం దృష్టి సారిస్తాం. 

ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసే ప్రశ్నే లేదు. ఆ మేరకు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతాం. విజయనగరం జిల్లాలో ఉన్న మెగ్నీషియం గనులను రాష్ట్రానికి కేటాయించాలి, వాటి లీజులను పునరుద్ధరించాలి అని మేం ప్రస్తావించాం... వాటి లైసెన్స్ లను పునరుద్ధరించాలి అని సీఎం చంద్రబాబు కూడా ఆదేశించారు. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మేం ఎంత పట్టుదలతో పనిచేస్తున్నామో చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. 

విశాఖ రైల్వే జోన్ గురించి పదేళ్లుగా నేను చాలా శ్రమించాను. భూమికి సంబంధించిన సమస్యతో దానికి అవాంతరం ఏర్పడింది. దానిపై విశాఖ జిల్లా కలెక్టర్ తో మాట్లాడాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ భరత్ కూడా దీనిపై అందరితో సంప్రదింపులు జరుపుతున్నారు. రైల్వే జోన్ కు కావాల్సిన భూమి విషయంలో చర్యలు వేగవంతం చేసి, త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చూస్తాం" అని రామ్మోహన్ నాయుడు వివరించారు.

  • Loading...

More Telugu News