Thar Roxx: 5 డోర్లతో మహీంద్రా నుంచి సరికొత్త ‘థార్ రాక్స్’.. విడుదల తేదీ, ఇతర వివరాలు ఇవిగో
- ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన మహీంద్రా అండ్ మహీంద్రా
- కనిష్ఠ ధర రూ.13 లక్షల నుంచి ప్రారంభం.. గరిష్ఠ ధర రూ.25 లక్షలు ఉండొచ్చని అంచనా
- థార్ విడుదలైన నాలుగేళ్ల తర్వాత కీలక అప్‌డేట్‌లు చేసిన కంపెనీ
దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో మరో సరికొత్త వాహనం ఆవిష్కరణకు సిద్ధమైంది. 5 డోర్లతో ‘మహీంద్రా థార్ రాక్స్’ను విడుదల చేయబోతున్నట్టు ఇవాళ(శనివారం) ప్రకటించింది. దీనిని ఆగస్టు 15న ఆవిష్కరించబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కారు టీజర్‌ను విడుదల చేసింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే తేదీన ‘థార్’ను మార్కెట్‌లో ప్రవేశపెట్టామని పేర్కొంది.
‘థార్ రాక్స్’లో కొత్త రెండు డోర్లు జత చేశామని, కారు పొడవు, వీల్‌బేస్ పెరిగాయని కంపెనీ వివరించింది. ‘థార్ రాక్స్’ డిజైన్‌ను కూడా ఆధునికీకరించామని వివరించింది. సర్క్యూలర్ హెడ్‌లైట్లు, గ్రిల్ కూడా కొత్తవేనని తెలిపింది. కాగా కొన్ని మార్పులతో వచ్చినప్పటికీ నాలుగేళ్ల క్రితం విడుదలైన మహీంద్రా ఎస్‌యూవీ 'థార్'కు చెందినదే అనే భావం కలుగుతోంది.
ధర రూ.13 లక్షల నుంచి ప్రారంభం!
మహీంద్రా థార్ రాక్స్ ఆరంభ ధర సుమారు రూ.13 లక్షల నుంచి ప్రారంభమవ్వొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక గరిష్ఠ ధర ఎక్స్-షోరూమ్‌లో రూ.25 లక్షల వరకు ఉండొచ్చని కథనాలు పేర్కొంటున్నాయి. ఇక థార్ 5-డోర్ ప్రత్యేకతల విషయానికి వస్తే... 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్, 2.2లీటర్ డీజిల్ ఇంజన్ రెండు ఇంజన్ ఆప్షన్లకు అవకాశం ఉంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లకు ఛాన్స్ ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. థార్ రాక్స్ ఒక 4x4 డ్రైవ్‌ట్రెయిన్, తక్కువ నిష్పత్తిలో గేర్‌బాక్స్, వెనుక యాక్సిల్‌కు మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్, ఫ్రంట్ యాక్సిల్‌కు బ్రేక్-లాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది. మార్కెట్లో ధరలను పోటీగా ఉంచేందుకుగానూ టూ-వీల్ డ్రైవ్ వేరియంట్‌లను కూడా మహీంద్రా కంపెనీ ఆఫర్ చేయవచ్చునని కథనాలు పేర్కొంటున్నాయి.