Jagan: బుధవారం ఢిల్లీలో నిరసన తెలుపుదాం.. చంద్రబాబు ప్రభుత్వ దారుణాలను దేశ ప్రజలకు తెలుపుదాం: వైఎస్ జగన్
- దాదాపు 40 నిమిషాల పాటు వైసీపీ ఎంపీలతో సమావేశమైన జగన్
- వైసీపీకి ఒక మెసేజ్ పంపడానికి వినుకొండ హత్య చేశారన్న జగన్
- రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచన
వైసీపీ ఎంపీలతో పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని చెప్పారు. వినుకొండలో జరిగిన హత్యను చూస్తే... రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుందని అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఒక మెసేజ్ పంపడానికి చేసిన ప్రయత్నం ఈ హత్య అని చెప్పారు.
తన సొంత పార్లమెంట్ నియోజకవర్గం, తన తండ్రి పెద్దిరెడ్డి శాసనసభ నియోజకవర్గంలో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడులు చేశారని జగన్ తెలిపారు. పోలీసులతో ముందే ప్లాన్ చేసి దాడులు చేశారని చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలుపుతామని చెప్పారు. మంగళవారం నాటికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఢిల్లీకి వస్తారని... బుధవారం ఢిల్లీలో నిరసన తెలుపుదామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను దేశ ప్రజలకు వివరిద్దామని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ దారుణాలను పార్లమెంటు, దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ఢిల్లీలో ధర్నా, నిరసన కార్యక్రమాలకు సంబంధించి ఒక్కో ఎంపీకి ఒక్కో బాధ్యత అప్పగించాలని ఆదేశించారు. ఎంపీలంతా వెంటనే ఢిల్లీకి వెళ్లే పనిలో ఉండాలని చెప్పారు.