Nagababu: అసెంబ్లీ ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీలో ధర్నా అంటున్నారు: నాగబాబు

Nagababu slams Jagan decision to protest in Delhi

  • ఏపీలో శాంతిభద్రతలపై ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్న జగన్
  • ఇదో కొత్త నాటకం అంటూ నాగబాబు విమర్శనాస్త్రాలు
  • రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వస్తే ప్రజావేదిక కూల్చినప్పుడే పెట్టాలని వ్యాఖ్యలు

వైసీపీ అధినేత జగన్ నిన్న వినుకొండలో చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. రషీద్ హత్య, ఇతర ఘటనలతో ఏపీలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని, ఈ సంగతి దేశమంతా తెలియజేసేందుకే తాము ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేపడుతున్నామని జగన్ ప్రకటించడాన్ని నాగబాబు తప్పుబట్టారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా, ఆ సమావేశాలు ఎగ్గొట్టేందుకే జగన్ ఢిల్లీలో ధర్నా అంటున్నారని విమర్శించారు. 

"ఇంకా ఎంతకాలం నటిస్తారు మీరు... ఓపెన్ గా ఉండండి. 2019లో మీకు ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. కానీ మీరు దాన్ని దుర్వినియోగం చేసుకుని, ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. ప్రజలను హింసించి వదిలిపెట్టారు మీరు. మీ పరిపాలనలో సామాన్యులు భయపడిపోయే పరిస్థితి వచ్చింది.

ఒక దళిత డ్రైవర్ ను చంపేసిన మీ ఎమ్మెల్సీని అతడి తప్పును ఖండించకపోగా, మీతో పాటు సగర్వంగా తిప్పుకున్నారే... అది  తప్పనిపించలేదా మీకు? డాక్టర్ సుధాకర్ ను ఉద్యోగం నుంచి ఊడబెరికి, పిచ్చోడ్ని చేసి రోడ్డుపై చొక్కా కూడా లేకుండా పోలీసులతో తన్నించారు కదా... చివరికి అతడు చనిపోయేలా చేశారు... అప్పుడు ఎలాంటి కామెంట్లు చేయాలని మీకు అనిపించలేదా? 

తన అక్కను కొందరు వైసీపీ నేతలు వేధిస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే మైనర్ బాలుడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు కదా... అప్పుడు కూడా మీరు స్పందించలేదు... ఎందుకని? ఇలాంటివి ఎన్ని చూశామో మీ పాలనలో! ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులు కాజేయడానికి మీరు ఎంత కుట్ర పన్నారు? దాన్ని మేం సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు తెలియజేయడం వల్లే కదా... ఇవాళ ప్రజలు సేవ్ అయ్యారు! నిజంగా ప్రజలు రెండోసారి మిమ్మల్ని రాకుండా చేసి తమను తాము కాపాడుకున్నారు. 

ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ధర్నా చేసి, రాష్ట్రపతి పాలన  పెట్టాలని అడుగుతారా? ఏమన్నా కొంచెమై ఆలోచన ఉందా మీకు? మీకు ఇలాంటి సలహాలు ఇచ్చేవాళ్లెవరో తెలియడంలేదు మాకు. సజ్జల లాంటి వాళ్లు వెళ్లిపోయారో, లేక ఇంకా ఉన్నారో! 

నిజంగా రాష్ట్రపతి పాలనే పెట్టాల్సి వస్తే... మీ పరిపాలనలో ప్రజావేదిక కూల్చినప్పుడే రాష్ట్రపతి పాలన పెట్టాలి. మీ దుర్మార్గమైన పాలనలోనే రాష్ట్రపతి పాలన పెట్టలేదు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఉండడానికే, ఢిల్లీ వెళ్లాలంటూ ఈ కొత్త నాటకం సృష్టిస్తున్నారు" అంటూ నాగబాబు విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News