Wagh Nakh: 350 ఏళ్ల తరువాత స్వదేశానికి వచ్చిన ఛత్రపతి శివాజీ రహస్య ఆయుధం
- ఇన్నాళ్లుగా లండన్ ఆల్బర్ట్ మ్యూజియంలో ‘వాఘ్ నఖ్’
- తాత్కాలిక ప్రాతిపదికన మూడేళ్ల కోసం భారత్‌కు తీసుకొచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
- సతారా జిల్లాలోని మ్యూజియంలో ఏడు నెలల పాటు ఆయుధ ప్రదర్శన
- వాఘ్ నఖ్‌తో బీజాపూర్ సేనాధిపతిని చంపి మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికిన శివాజీ
ముఘల్ సామ్రాజ్యం అంతానికి నాంది పలికిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకి చెందిన రహస్య ఆయుధం ‘వాఘ్ నఖ్’ ఎట్టకేలకు భారత్‌కు చేరుకుంది. లండన్‌లోని ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న ఈ ఆయుధాన్ని తాత్కాలిక ప్రాతిపదికన మూడేళ్ల కోసం భారత్‌కు తీసుకొచ్చారు. 350 ఏళ్ల నాటి ఈ ఆయుధాన్ని బుల్లెట్‌ప్రూఫ్ కవర్‌లో, భారీ సెక్యూరిటీ మధ్య మహారాష్ట్ర ప్రభుత్వం భారత్‌కు తెచ్చింది. సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు పెట్టారు. ఈ వేడుకకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర నాయకులు హాజరయ్యారు. ఏడు నెలల పాటు వాఘ్ నఖ్‌ను సందర్శకుల కోసం మ్యూజియంలో ఉంచుతారు.
చరిత్ర ఇదీ..
1649లో ఛత్రపతి శివాజీ బీజాపూర్ సుల్తాన్‌ను ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు. అంతకుముందు బీజాపూర్ సేనాధిపతి అప్జల్ ఖాన్‌తో సమావేశమైన శివాజీ రహస్యంగా తన వద్ద దాచుకున్న వాఘ్ నఖ్‌తో అతడిని అంతమొందించాడు. ప్రతాప్‌గఢ్ కోటలో ఈ ఘటన జరగింది. ఇది ప్రస్తుతం సతారా జిల్లాలో ఉండటంతో ప్రభుత్వం ఈ ఆయుధాన్ని ఇక్కడి మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచింది.
ఇక ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో శివాజీ ఆయుధం అంశం తమకు కలిసి వస్తుందని శివసేన (ఏక్‌నాథ్) శిండే వర్గం భావిస్తోంది. మరాఠా అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ఆయుధం తమ విశ్వసనీయతను పెంచుతుందని నమ్ముతోంది.