GV Anjaneyulu: ఎవరు ఏది రాసిస్తే అది మాట్లాడడం సిగ్గుచేటు: జగన్ పై వినుకొండ ఎమ్మెల్యే విమర్శలు

Vinukonda MLA GV Anjaneyulu slams YS Jagan

  • వినుకొండలో రషీద్ అనే యువకుడి హత్య
  • నేడు రషీద్ కుటుంబానికి జగన్ పరామర్శ
  • ఈ హత్య టీడీపీ పనే అంటూ జగన్ వ్యాఖ్యలు
  • చంపింది, చనిపోయింది ఇద్దరూ వైసీపీ కార్యకర్తలేనన్న జీవీ ఆంజనేయులు

వైసీపీ అధినేత జగన్ ఇవాళ వినుకొండ వచ్చి, హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అధికార టీడీపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వినుకొండలో జగన్ చేసిన వ్యాఖ్యలపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అదే స్థాయిలో స్పందించారు. 

జగన్ శవ రాజకీయాల కోసమే వినుకొండ వచ్చారని విమర్శించారు. హత్య చేసిన జిలానీ, హత్యకు గురైన రషీద్ ఇద్దరూ వైసీపీకి చెందిన వారేనని, వారిద్దరినీ రాజకీయంగా పెంచి పోషించింది వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడేనని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. 

రాష్ట్రం కోసం ఏనాడూ ఢిల్లీలో ఆందోళన చేపట్టని జగన్, ఇప్పుడు రాష్ట్రం పరువు తీసేందుకు ఢిల్లీలో నిరసన తెలియజేస్తామనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. 

"ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ఎవరు ఏది రాసిస్తే దాన్ని మాట్లాడడం సిగ్గుచేటు. ఆధారాలు లేకుండా మాట్లాడడం దురదృష్టకరం. గతంలో జిలానీ వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ తో తిరిగిన ఫొటోలు ఉన్నాయి. జిలానీ, హతుడు రషీద్ వైసీపీ కార్యకర్తలుగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య గొడవలు జరిగింది నిజం కాదా? దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవకు పార్టీల రంగు పులుముతారా? 

బొల్లా బ్రహ్మనాయుడు రౌడీయిజాన్ని ప్రోత్సహించడం వల్లే ఇవాళ జిలానీ హంతకుడిగా మారాడు. రషీద్ చనిపోవడం దురదృష్టకరం. అతడి కుటుంబం ఎంతో నష్టపోయింది" అని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

GV Anjaneyulu
Jagan
Vinukonda
TDP
YSRCP
  • Loading...

More Telugu News