Bandi Sanjay: బండి సంజయ్‌కి పొన్నం ప్రభాకర్ సవాల్

Ponnam Prabhakar challanges Bandi Sanjay

  • 70 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదనడంపై ఆగ్రహం
  • నిరూపించకుంటే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్
  • రుణమాఫీ చేస్తే సంతోషించాల్సింది పోయి విమర్శలు సరికాదని వ్యాఖ్య

కేంద్రమంత్రి బండి సంజయ్‌కి తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీ 70 శాతం మందికి వర్తించడం లేదని బండి సంజయ్ అన్నారని, అది నిరూపించకపోతే తన పదవికి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సంజయ్ రైతులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తుంటే ఎందుకు భరించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు నల్లచట్టాలను తెచ్చి అణచివేసే ప్రయత్నం చేసిందే బీజేపీ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుంటే సంతోషంచాల్సింది పోయి విమర్శలు చేయడం సరికాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ స్థాయిలో రుణమాఫీ చేశారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ మాట్లాడిన తీరు విడ్డూరంగా ఉందన్నారు. గతంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకువచ్చింది మోదీ ప్రభుత్వమే అన్నారు. భారీ వర్షాలకు గుజరాత్‌లో పంట నష్టపోతే రైతులకు ఏమైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు.

తొలుత కేంద్రం నుంచి రాష్ట్రానికి సంజయ్ ఏం తీసుకువచ్చారో చెప్పాలని నిలదీశారు. రుణమాఫీపై చేసిన వ్యాఖ్యలకు గాను బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో‌లో 60 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ ఇస్తామని ప్రకటించారని... కానీ ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. రైతుల మీద ఫసల్ బీమా భారాన్ని పెంచారని మండిపడ్డారు. ఎరువుల సబ్సిడీలో రూ. 75 వేల కోట్లు కోత పెట్టారని, కాంప్లెక్స్ ఎరువుల ధరలను రెట్టింపు చేశారని, అగ్రికల్చర్ సెస్ పేరుతో పంట ఖర్చులు పెంచారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News