Jagan: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సానుభూతిపరులను ఇలాగే చంపుతామని సందేశం పంపినట్టుంది: వినుకొండలో జగన్

Jagan press meet in Vinukonda

  • వినుకొండలో రషీద్ అనే యువకుడి దారుణ హత్య
  • టీడీపీ వ్యక్తే హత్య చేశాండంటున్న జగన్
  • నేడు రషీద్ కుటుంబానికి పరామర్శ
  • ఏపీలో అటవిక పాలన కొనసాగుతోందని ఆగ్రహం

వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అటవిక పాలన కొనసాగుతోందని అన్నారు. గత 45 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఏ సామాన్యుడ్ని అడిగినా ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనే చెబుతున్నారని పేర్కొన్నారు. 

టీడీపీ వాళ్లయితే చాలు... వారు ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరి ఆస్తులైనా ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరిపైనైనా హత్యాయత్నం చేయొచ్చు, వారు ఏం చేసినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తారు, బాధితులపైనే కేసులు పెడతారు అనే నీచ సంస్కృతి ఇవాళ రాష్ట్రంలో రాజ్యమేలుతోందని జగన్ వ్యాఖ్యానించారు. 

"చంద్రబాబు నాయుడి గారిని ఒకే ఒక్కటి అడుగుతున్నా. ఈ 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ వాళ్ల వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. 

ఇళ్లలో చొరబడుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, షాపులు కాల్చివేస్తున్నారు, వైసీపీ సానుభూతిపరుల చీనీ తోటలు నాశనం చేస్తున్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఇవికాకుండా... 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇదీ. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని చెప్పడానికి వినుకొండలో రషీద్ హత్య ఘటనే ఉదాహరణ. ఇంతకుముందు ఇక్కడ రవిశంకర్ రెడ్డి అని మంచి ఎస్పీ ఉండేవాడు. కానీ ఎన్నికల వేళ వీళ్లకున్న పలుకుబడితో ఆయనను తప్పించేశారు. ఆ తర్వాత వీళ్లకు కావాల్సిన బిందు మాధవ్ అనే అధికారిని తెచ్చుకున్నారు. ఈ బిందు మాధవ్ ఎంతటి అన్యాయస్తుడు అంటే, ఎన్నికల సంఘమే స్వయంగా జోక్యం చేసుకుని అతడ్ని తప్పించాల్సి వచ్చింది. 

ఆ తర్వాత ఎన్నికల సంఘమే మలికా గార్గ్ అనే మంచి ఆఫీసర్ ను తీసుకువచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ ను కూడా పంపించివేశాడు. ఆ తర్వాత వీళ్లకు కావాల్సిన శ్రీనివాస్ అనే ఎస్పీని తెచ్చుకున్నారు. ఆ ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఈ హత్య జరిగింది. 

అత్యంత దారుణంగా, నడిరోడ్డుపై, అమాయకుడైన వ్యక్తిని అతి కిరాతకంగా నరికి చంపడం ప్రజలందరూ చూశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సానుభూతిపరులను ఇలాగే చంపుతామని సందేశం పంపినట్టుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కూడా పత్రికల ముసుగులో దిగజారిపోయాయి. హత్య చేసిన జిలానీ బైక్ ను గతంలో వైసీపీ వాళ్లు కాల్చేశారట... అందుకే ఈ హత్య జరిగిందని ఈనాడులో దిక్కుమాలిన అబద్ధం రాశారు. నిజంగా ఇవి పేపర్లా, టీవీ చానళ్లేనా? సిగ్గుతో తలదించుకోవాలి. 

వాస్తవానికి ఆ బైక్ ఆసిఫ్ అనే వైసీపీ మద్దతుదారుడింది. అప్పట్లో తన బైక్ తగలబెట్టారంటూ ఆసిఫ్ టీడీపీ నేతలపై కేసు పెట్టాడు. జరిగిన ఇన్సిడెంట్ ఇదీ. అది కూడా ఈ ఏడాది జనవరి 17న ఆ ఘటన జరిగింది. వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగిందని పోలీసులు కూడా సహకారం అందిస్తున్నారు" అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News