Palla Rajeshwar Reddy: రుణమాఫీ సంబరాల్లో సిద్దిపేట కలెక్టర్ పాల్గొనడం ఏమిటి?: పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeshwar Reddy fires at Congress government

  • రైతులకు కాంగ్రెస్ ఆందోళన మిగిల్చిందని విమర్శ
  • రైతులకు చేసింది గోరంత... చెప్పేది కొండంత అని ఎద్దేవా
  • రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్

రైతు రుణమాఫీ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల సంబరాల్లో సిద్దిపేట కలెక్టర్ పాల్గొనడం ఏమిటని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో కలెక్టర్ పాల్గొనడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతులకు కేసీఆర్ ఆనందాన్నిస్తే కాంగ్రెస్‌ ఆందోళన మిగిల్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పిన హామీ ఏమైందో చెప్పాలన్నారు.

రైతుల రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. రైతులకు కాంగ్రెస్ చేసింది గోరంత.. చెప్పేది కొండంత అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ హయాంలో మొదటి విడతలో 35 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేశారని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షల పేరుతో కొంతమంది రైతులకే మాఫీని చేసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. రైతు భరోసా కింద రైతులకు వెంటనే పెట్టుబడిసాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆరే అన్నారు. రైతుబంధు కింద కేసీఆర్‌ రూ.70 వేల కోట్లు ఇచ్చారని పేర్కొన్నారు. 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని కేసీఆర్‌ హయాంలో రైతులు పండించారని వెల్లడించారు. కేసీఆర్ కట్టించిన రైతు వేదికల్లో కాంగ్రెస్‌ సంబురాలు చేసిందని చురక అంటించారు. కాంగ్రెస్ నాయకులకు బూతులు తప్ప రైతులపై శ్రద్ధలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News