Harish Rao: రుణమాఫీ నేపథ్యంలో రాజీనామా సవాలుపై హరీశ్ రావు కీలక ప్రకటన

Harish Rao announced that he will resign if all farmers in the state are given a loan waiver of Rs 2 lakh by August 15

  • ఆగస్టు 15 లోగా రైతులు అందరికీ రుణమాఫీ చేస్తే రాజీనామాకు సిద్ధమని వెల్లడి
  • ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎన్నిసార్లైనా రాజీనామా చేస్తానని ప్రకటన
  • గతంలో సవాలు విసిరి వెనక్కి తగ్గిన చరిత్ర మీదంటూ సీఎం రేవంత్‌పై హరీశ్ రావు విమర్శలు

ఇవాళ (గురువారం) తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ సజావుగా జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తానంటూ సవాలు విసిరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన విడుదల చేశారు. 

తనకు పదవులు కొత్త కాదని, రాజీనామాలు కొత్త కాదని పేర్కొన్న ఆయన... ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు మంచి జరుగుతుందంటే తాను ఎన్నిసార్లైనా పదవులకు రాజీనామా చేయడానికి వెనుకాడబోనని అన్నారు. ‘‘మరోసారి చెబుతున్నా ఆగష్టు 15 లోగా రాష్ట్రంలోని రైతులు అందరికీ రూ.2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా..?’’ అని సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి హరీశ్ రావు సవాలు విసిరారు.

అప్పుడు వెన్నుచూపి పారిపోయింది తమరు!
‘సీఎం రేవంత్ రెడ్డి గారూ!, తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు’ అని హరీశ్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరంటూ ప్రస్తావించారు. ‘‘ రేవంత్ రెడ్డి గారు.. నిరంతరంగా పారిపోయిన చరిత్ర మీది. అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది‘‘ అని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.

కాగా ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానంటూ హరీశ్ రావు సవాలు విసిరారని, ఇవాళ రైతు రుణమాఫీ జరగడంతో మాటకు కట్టుబడి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో హరీశ్ రావు స్పందించారు.

More Telugu News