KTR: రైతుబంధు నిధులనే దారి మళ్లించి రుణమాఫీ చేశారు: కేటీఆర్
- రుణమాఫీ పేరిట ప్రభుత్వం తెలంగాణ రైతులను మోసం చేస్తోందని విమర్శ
- రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులను రుణమాఫీకి మళ్లించారన్న కేటీఆర్
- అర్హులైన వారందరికీ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్
రైతుబంధు నిధులనే దారి మళ్లించి రుణమాఫీ చేశారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. రుణమాఫీ పేరిట రేవంత్ ప్రభుత్వం మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తోందన్నారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధుల నుంచి రూ.7 వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించారన్నారు.
రైతుబంధు డబ్బుల నుంచి కొంత విదిల్చి రుణమాఫీ చేస్తున్నట్లు చెబుతున్నారని మండిపడ్డారు. 40 లక్షలకు పైగా రైతులు రూ.1 లక్ష రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేశారని ప్రశ్నించారు. 2014, 2018లో కేసీఆర్ ప్రభుత్వం, రుణమాఫీతో పోలిస్తే పావువంతు రైతులకే అర్హత కల్పించారన్నారు.
2014లో కేసీఆర్ ప్రభుత్వం లక్ష లోపు రుణాలను మాఫీ చేయడానికి రూ.16,144 కోట్లు వెచ్చించిందని, దీంతో 35 లక్షల మంది వరకు రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. 2018లో 37 లక్షల మందికి 19 వేల కోట్లకు పైగా మాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని, అర్హులైన వారందరికీ రైతుబంధు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.