UP BJP: యూపీ బీజేపీలో లుకలుకలు.. సీఎం, డిప్యూటీ సీఎం మధ్య విభేదాలు

UP CM Yogi Adityanath vs deputy Keshav Maurya

  • లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత యోగి, మౌర్య మధ్య విభేదాలు 
  • పార్టీ కంటే ప్రభుత్వం, వ్యక్తులు గొప్పవారు కాదంటూ మౌర్య పోస్ట్
  • పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో ఢిల్లీలో ఒంటరిగా సమావేశం
  • విభేదాలు పరిష్కరించాలని యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరికి నడ్డా సూచన

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు మధ్య విభేదాలు పొడసూపినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. పార్టీ కంటే ప్రభుత్వం గొప్పది కాదని, ఏ ఒక్కరూ పార్టీ కంటే గొప్పవారు కాదంటూ మౌర్య నిన్న ఎక్స్‌లో చేసిన పోస్టు కూడా వారి మధ్య విభేదాలు ఉన్న సంగతిని బయటపెట్టింది. 

మౌర్య మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఒంటరిగా భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘోర వైఫల్యంతోపాటు త్వరలో రాష్ట్రంలో జరగనున్న 10 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలపై చర్చించినట్టు తెలిసింది. అలాగే, యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌదరి కూడా నడ్డాతో సమావేశమయ్యారు. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను తొలగించే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ఆయనకు నడ్డా సూచించినట్టు తెలిసింది. 

ఉప ఎన్నికల ఫలితాల తర్వాత యూపీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, తాజా పరిణామాలపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ అంతర్గత కలహాలతో బీజేపీ మునిగిపోతుందని పేర్కొన్నారు.

More Telugu News