Reservation in Private Sector Bill: కర్ణాటక ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు బ్రేక్

Karnataka reservation in private sector bill paused

  • తదుపరి కేబినెట్ సమావేశంలో సమగ్ర చర్చ జరిపి తుది నిర్ణయం తీసుకుంటామన్న సీఎం  
  • బిల్లుపై టెక్ కంపెనీలు, నాస్‌కామ్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత
  • స్థానికులకు రిజర్వేషన్ అమలు చేస్తే సంస్థలు కర్ణాటకను వీడుతాయని హెచ్చరిక

ప్రైవేటు సంస్థల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఈ బిల్లుకు టెక్ కంపెనీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లుపై మరింత సమగ్ర అధ్యయనం చేసేందుకు వీలుగా దీనిని నిలుపుదల చేస్తున్నట్టు ప్రభుత్వం తాజాగా పేర్కొంది. ‘‘ప్రైవేటు రంగంలో కన్నడిగులకు రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు ఇంకా రూపకల్పన దశలోనే ఉంది. తదుపరి కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై మరింత సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎక్స్ వేదికగా ప్రకటించారు. 

సోమవారం కేబినెట్ ఓకే చేసిన ఈ బిల్లును సరోజినీ మనీషీ కమిటీ రికమెండేషన్ల ఆధారంగా రూపొందించారు. ఈ బిల్లు ప్రకారం, ప్రైవేటు సంస్థల్లోని నాన్ మేనేజ్‌మెంట్ పోస్టుల్లో 70 శాతం, మేనేజ్‌మెంట్ పోస్టుల్లో 50 శాతం స్థానికులకే ఇవ్వాలి. అర్హులైన స్థానికులు లేని పక్షంలో బయటి వారికి ఉద్యోగాలు ఇవ్వాలి. అయితే, స్థానిక కన్నడిగుల్లో అర్హులైన ఉద్యోగులకు కొరతేమీ లేదని కూడా సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. తమది కన్నడిగుల అనుకూల ప్రభుత్వమని, కన్నడిగులు తమ మాతృభూమిలో సుఖవంతమైన జీవనం సాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 

దీంతో, వ్యాపార వర్గాల నుంచి ఒక్కసారిగా కలకలం రేగింది. ఐటీ సంస్థల ప్రతినిధి సంఘం నాస్‌కాం కూడా ఈ బిల్లుపై స్పందించింది. స్థానికులకే ఉద్యోగాలంటే టెక్ కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోతాయని హెచ్చరించింది. బిల్లును ఉపసంహరించుకోవాలని పేర్కొంది. మరోవైపు, ఘటనపై బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా కూడా స్పందించారు. స్థానికులకు ఉద్యోగకల్పన ముఖ్యమే గానీ ఈ బిల్లు టెక్ రంగంలో అగ్రగామిగా ఉన్న నగరానికి ప్రతిబంధకం కాకూడదని ఆకాంక్షించారు. ఇలా విభిన్నవర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం వెనకడుగు వేసింది.

Reservation in Private Sector Bill
Karnataka
Nasscom
Kiran Mazumdar Shaw
  • Loading...

More Telugu News