Bihar Shoes: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో బీహార్ బూట్లు... వివరాలు ఇవిగో!

Bihar shoes in Russia and Ukrain battle

  • గత రెండేళ్లుగా ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడులు
  • బీహార్ బూట్లను వినియోగిస్తున్న రష్యా సైనికులు
  • లైట్ వెయిట్ తో ప్రతికూల వాతావరణంలోనూ సౌకర్యవంతంగా బీహార్ బూట్లు
  • హాజీపూర్ సంస్థకు రూ.100 కోట్ల ఆర్డర్ ఇచ్చిన రష్యా సైన్యం!

గత రెండేళ్లుగా రష్యా... ఉక్రెయిన్ పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. కాగా, ఈ యుద్ధంలో రష్యా సైనికులు ఉపయోగిస్తున్న బూట్లు మనదేశంలోని బీహార్ రాష్ట్రంలో తయారవుతున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. 

బీహార్ లో రాజధాని పాట్నా తర్వాత బాగా అభివృద్ధి చెందుతున్న నగరం హాజీపూర్. ఈ పట్టణం పాదరక్షల తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తయారయ్యే నాణ్యమైన పాదరక్షలకు అంతర్జాతీయంగా పేరుంది. అందుకే, రష్యా సైన్యం తమ సైనికుల కోసం హాజీపూర్ బూట్లనే వినియోగిస్తోంది. 

హాజీపూర్ లోని కాంపిటెన్స్ ఎక్స్ పోర్ట్స్ కంపెనీ... రష్యా సైనికులకు బూట్లు సరఫరా చేసేందుకు రూ.100 కోట్ల ఆర్డర్ పొందడం మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్మీల్లో రష్యా సైన్యం కూడా ఒకటి. రష్యన్ సైనికులు ఉపయోగించే ఆయుధాలు కానీ, సాంకేతిక పరికరాలు కానీ, వారి యూనిఫాం, ఇతర ఉపకరణాలు కానీ నాణ్యతా ప్రమాణాల పరంగా ఏమాత్రం రాజీపడరు. అందుకే, రష్యా ఆర్మీ బూట్ల తయారీకి పేరెన్నికగన్న హాజీపూర్ లో తమ సైనికులకు బూట్లు తయారు చేయిస్తోంది. 

బీహార్ బూట్లు ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకునేలా రూపొందిస్తారు. ఇవి తేలిగ్గా ఉండడమే కాదు, మైనస్ 40 డిగ్రీల అత్యంత శీతల వాతావరణంలోనూ సౌకర్యవంతంగా ఉంటాయి. 

గతేడాది కాంపిటెన్స్ ఎక్స్ పోర్ట్స్ కంపెనీ 15 లక్షల మిలిటరీ గ్రేడ్ బూట్లను రష్యాకు ఎగుమతి చేసింది. తమ బూట్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా... కాంపిటెన్స్ కంపెనీ ప్రజల వినియోగం కోసం డిజైనర్ షూ తయారు చేసి యూరప్ మార్కెట్లో విడుదల చేయాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News