ICC T20 rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అదరగొట్టిన భారత కుర్రాళ్లు

Yashasvi Jaiswal and Shubman Gill massive gains in latest ICC T20 rankings

  • నాలుగు స్థానాలు మెరుగుపడి 6వ ర్యాంకులో నిలిచిన యశస్వి జైస్వాల్
  • 37 స్థానాలు మెరుగుపరచుకొని 36వ ర్యాంకు చేరుకున్న శుభ్‌మన్ గిల్
  • జింబాబ్వే టూర్‌లో రాణించడంతో మెరుగుపడిన ర్యాంకులు
  • బౌలర్ల కేటగిరిలో టాప్-10లో ఒక్కభారత బౌలర్ కూడా లేని వైనం

ఇటీవల జింబాబ్వేతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన యంగ్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. ముఖ్యంగా డాషింగ్ ఓపెనర్ జైస్వాల్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకొని 6వ ర్యాంకులో నిలిచాడు. జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో జైస్వాల్ మూడు మ్యాచ్‌లు ఆడి 70.50 సగటుతో మొత్తం 141 పరుగులు బాదాడు. 165.88 స్ట్రైక్ రేట్‌తో జింబాబ్వే బౌలర్లపై దాడి చేశాడు. ముఖ్యంగా 4వ టీ20 మ్యాచ్‌లో చెలరేగాడు. కేవలం 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఏకంగా 93 పరుగులు సాధించాడు. 

మరోవైపు టూర్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శుభమాన్ గిల్ కూడా ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌లో నిలిచాడు. సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లూ ఆడిన గిల్ మొత్తం 170 పరుగులు చేశాడు. అతడి సగటు 42.50 పరుగులుగా ఉంది. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి స్ట్రైక్ రేట్ 125.92గా ఉంది.

ఇక టాప్-2గా భారత డాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. అయితే ఇంగ్లండ్‌ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఒక స్థానం ఎగబాకి సూర్యతో సమానమైన పాయింట్లతో (797) మూడవ స్థానంలో నిలిచాడు. కాగా ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ మొత్తం 844 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. జులై 26 నుంచి శ్రీలంక వర్సెస్ భారత్ జట్ల మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. భారత ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ర్యాంకులు మారే అవకాశం ఉంటుంది.

టాప్-10లో భారత బౌలర్లకు దక్కని చోటు
బౌలర్ల విషయానికి వస్తే, ఐసీసీ టీ20 బౌలర్ ర్యాంకుల్లో ఒక్క భారత బౌలర్‌కూ  చోటు దక్కలేదు. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ వీరు ముగ్గురూ జింబాబ్వే టూర్‌లో ఆడకపోవడంతో పాయింట్లను కోల్పోయారు. గతంలో నాలుగవ స్థానంలో నిలిచిన కుల్దీప్ ఇప్పుడు 15వ స్థానానికి దిగజారాడు. ఇక గత అప్‌డేట్‌లో 7, 5 స్థానాల్లో నిలిచిన పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్ ఇప్పుడు వరుసగా 21, 23 స్థానాలకు పడిపోయారు. ఇక ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో గతంలో 9వ స్థానంలో నిలిచిన అక్షర్ పటేల్ ఇప్పుడు 15వ స్థానానికి పడిపోయాడు.

More Telugu News