Indian Railways: సికింద్రాబాద్ ఐఆర్ఐఎఫ్ఎమ్ లో కొత్త కోర్సు... వివరాలు ఇవిగో!

New course introduced in Indian Railway Institute Secunderabad

  • ఐఆర్ఐఎఫ్ఎమ్ లో కొత్తగా ఫోరెన్సిక్ అకౌంటింగ్, కార్పొరేట్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కోర్సు
  • కోర్సు వివరాలు తెలిపిన ఐఆర్ఐఎఫ్ఎమ్ అడిషనల్ డీజీ బి. సింగయ్య
  • జులై 15న ప్రారంభమైన కోర్సు

సికింద్రాబాద్ మౌలాలిలోని ఇండియన్ రైల్వే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ (ఐఆర్ఐఎఫ్ఎమ్) కొత్తగా ఫోరెన్సిక్ అకౌంటింగ్, కార్పొరేట్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ కోర్సును ప్రవేశపెడుతోంది. రైల్వే ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో ఈ తరహా కోర్సును తీసుకురావడం ఇదే ప్రథమం. జులై 15న ఈ కోర్సు ప్రారంభమైంది. 

ఈ కోర్సును హైబ్రిడ్ విధానంలో  రూపొందించారు. ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఏఎస్) అధికారులందరినీ క్రమేణా దీని పరిధిలోకి వచ్చేలా రూపకల్పన చేశారు. 
రైల్వే బోర్డులో ఆర్థిక సభ్యురాలిగా వ్యవహరిస్తున్న రూపా శ్రీనివాసన్ ఈ కోర్సు ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచంలో పరిణామాలు త్వరితగతిన మారిపోతున్నాయని, దాదాపు అన్ని రంగాలు అమితవేగంగా డిజిటలీకరణ చెందుతున్నాయని వివరించారు. డిజిటల్ రూపంలో ఉన్న ఏదైనా కచ్చితత్వంతో కూడుకున్నది అయ్యుంటుంది అనే ఓ నమ్మకం ప్రజల్లో ఉందని అన్నారు. 

అయితే, డిజిటలీకరణ చెందిన డేటాను తారుమారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని, పెద్ద ఎత్తున డేటాను నిర్వహించేటప్పుడు ఇలాంటి లోటుపాట్లు గుర్తించడం కష్టమైన విషయం అని రూపా శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు. 

ఈ క్రమంలో, భారీ స్థాయిలో డేటా నిర్వహించేటప్పుడు అందులో తప్పిదాలు ఎలా జరుగుతాయో గుర్తించాల్సిన అవసరం ఉందని, అందుకే ఫోరెన్సిక్ అకౌంటింగ్, డిజిటల్ మరియు సైబర్ ఫోరెన్సిక్స్ అంశాల్లో పరిజ్ఞానం పెంచుకోవడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. ఐపాస్ (IPAS) వంటి కొత్త అనువర్తనాలు (అప్లికేషన్లు), ట్రాఫిక్ అకౌంట్లు వంటి అంశాలపై విజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

తక్కువ సయయంలోనే ఈ కోర్సుకు రూపకల్పన చేయడంలో ఐఆర్ఐఎఫ్ఎమ్ కృషిని అభినందిస్తున్నట్టు తెలిపారు. కోర్సులో చేరిన వారు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రూపా శ్రీనివాసన్ తెలిపారు. 
ఇక, ఐఆర్ఐఎఫ్ఎమ్ డైరెక్టర్ జనరల్ అపర్ణ గార్గ్ మాట్లాడుతూ... ఈ నూతన కోర్సు ఐఆర్ఐఎఫ్ఎమ్ చరిత్రలోనే ఒక మైలురాయి వంటిదని అభివర్ణించారు. ఎన్ఎఫ్ఎస్ యూ (అహ్మదాబాద్), ఎన్ఎఫ్ఎస్ఎల్ (హైదరాబాద్) నిపుణులతో సంప్రదించి ఈ కోర్సును రూపొందించినట్టు వెల్లడించారు. కార్పొరేట్ సంస్థల ఆర్థిక వ్యవహారాలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ కోర్సు ఉపకరిస్తుందని వివరించారు. 

ఐఆర్ఐఎఫ్ఎమ్... ఈ కోర్సులో బోధన కోసం కొందరు ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్లు, సీఆర్ఐఎస్, కాగ్ కార్యాలయంలో పనిచేసే అనుభవజ్ఞులైన అధికారులు, రిటైర్డ్ రైల్వే అధికారుల సేవలను కూడా వినియోగించుకుంటుందని అపర్ణ గార్గ్ పేర్కొన్నారు. ఈ కోర్సు మాడ్యూల్ లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంటామని, అందుకే, ఈ కోర్సులో చేరిన ప్రతి బ్యాచ్ నుంచి ఫీడ్ బ్యాక్ (అభిప్రాయ సేకరణ) తీసుకుంటామని, కోర్సును పూర్తి చేసిన వారి అనుభవాలు తెలుసుకుంటామని వెల్లడించారు. 


కాగా, ఐఆర్ఐఎఫ్ఎమ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బి. సింగయ్య కోర్సు గురించి వివరించారు. ఈ కోర్సు కాల వ్యవధి రెండు వారాలు అని తెలిపారు. మొత్తం 60 గంటలు బోధన ఉంటుందని వెల్లడించారు. ఈ కోర్సు ప్రారంభోత్సవ సెషన్ కు వివిధ రైల్వే జోన్లకు చెందిన ముఖ్య ఆర్థిక సలహాదారులు, రైల్వే బోర్డుకు చెందిన సీనియర్ ఫైనాన్స్ అధికారులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News