Man Sets Mother on Fire: తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి మొబైల్ ఫోనులో రికార్డింగ్.. యువకుడి దారుణం!

Man Sets Mother On Fire Inside UP Police Station Films Her
  • ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలోని ఖైర్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
  • భూవివాదం తేల్చుకునేందుకు స్టేషన్‌కు వచ్చిన తల్లీకొడుకులు
  • స్టేషన్ బయకువెళ్లి మళ్లీ వస్తున్న తల్లిపై అకస్మాత్తుగా పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు
  • 40 శాతం కాలిన గాయాలతో మహిళ మృతి
ఉత్తరప్రదేశ్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌ బయట తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాల పాలైన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భూవివాదం కారణంగా యువకుడు ఈ దారునికి పాల్పడ్డాడు. తల్లి మంటల్లో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తుంటే అతడేమో అత్యంత పాశవికంగా ఆ దారుణ దృశ్యాన్ని వీడియోలో రికార్డు చేశాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అలీగఢ్‌లోని ఖైర్ పోలీస్ స్టేషన్‌లో ఈ దారుణం జరిగింది. ఓ స్థలం విషయమై తల్లి హేమలత, కొడుకు గౌరవ్ మధ్య వివాదం నడుస్తోంది. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. విషయాన్ని పరిష్కరించుకునేందుకు వారు మరోసారి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో బయటకు వెళ్లిన మహిళ తిరిగొస్తుండగా బయటే నిలబడ్డ కుమారుడు గౌరవ్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మహిళ తాళలేక కిందపడి గిలగిలా కొట్టుకుంది. మరోవైపు కొడుకేమో అత్యంత క్రూరంగా ఈ దృశ్యాలను తన మొబైల్ ఫోనులో రికార్డు చేశాడు. మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో క్షణకాలం వెనకడుగు వేసిన పోలీసులు.. ఆ మరుక్షణమే తేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. ఒంటిపై గోనెసంచులు వేసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.  ఆ తరువాత బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమెకు 40 శాతం కాలినగాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో పోలీసులు కూడా గాయాల పాలయ్యారు.
Man Sets Mother on Fire
Uttar Pradesh
Crime News

More Telugu News