Oman: ఒమన్ లో కాల్పులు... మృతుల్లో భారత జాతీయుడు
- మస్కట్ నగరంలోని ఓ మసీదు వద్ద కాల్పులు
- ఐదుగురి మృతి
- మృతుల్లో నలుగురు పాకిస్థానీలు
- కాల్పులకు పాల్పడిన దుండగులను హతమార్చిన ఒమన్ భద్రతా బలగాలు
గల్ఫ్ దేశం ఒమన్ లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఒమన్ రాజధాని మస్కట్ లోని అలి బిన్ అబి తాలిబ్ మసీదు వద్ద జరిగిన ఈ కాల్పుల ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు భారత జాతీయుడిగా గుర్తించారు. మిగతా నలుగురు పాకిస్థాన్ జాతీయులు. సున్నీల ప్రాబల్యం అధికంగా ఉండే ఒమన్ లో... అలి బిన్ అబి తాలిబ్ మసీదు షియా వర్గానికి చెందినది.
కాగా, మసీదు వద్ద కాల్పులకు తెగబడిన ముగ్గురు దుండగులను ఒమన్ భద్రతా బలగాలు హతమార్చాయి. దుండగుల కాల్పుల్లో 30 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పాకిస్థానీలు కూడా మృతి చెందడం పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. ఇది ఉగ్రదాడి అని పాక్ విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.