Rinku Singh: రింకూ సింగ్‌కి టెస్టుల్లో కూడా చోటివ్వాలి.. మాజీ బ్యాటింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Former India batting coach Vikram Rathour feels Rinku Singh has good enough technique to play Test cricket

  • టెస్టుల్లోకి తీసుకునే టెక్నిక్ రింకూ బ్యాటింగ్‌లో ఉందన్న విక్రమ్ రాథోర్
  • నెట్స్‌లో అతడి బ్యాటింగ్ గమనించినప్పుడు టెస్టులోకి తీసుకోకపోవడానికి కారణాలేవీ కనిపించలేదని వ్యాఖ్య
  • శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల‌్‌లను కూడా అన్ని ఫార్మాట్లలో ఆడించవచ్చునని అభిప్రాయం

టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్‌కి భారత్‌ టెస్టు క్రికెట్‌ జట్టులోనూ చోటు ఇవ్వాలని, టెస్టుల్లో ఆడే టెక్నిక్ అతడికి ఉందని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అభిప్రాయపడ్డాడు. టెస్టులు ఆడే టెక్నిక్ అతడి బ్యాటింగ్‌లో ఉందని, ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో అతడి సగటు 50కిపైగా ఉందని ప్రస్తావించాడు. 

‘‘నేను నెట్స్‌లో రింకూ సింగ్ బ్యాటింగ్‌ను గమనించినప్పుడు అతడు టెస్ట్ బ్యాటర్‌ కాకపోవడానికి సాంకేతిక కారణాలు ఏంటో నాకు అర్థం కాలేదు. టీ20 క్రికెట్‌లో అతడు అద్భుతమైన ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడని నాకు తెలుసు. అయితే అతడి ఫస్ట్‌క్లాస్ రికార్డును పరిశీలిస్తే 50 సగటుతో ఆడాడు. అతడు మెరుగయ్యేలా కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అతడికి అవకాశం ఇస్తే టెస్ట్ క్రికెటర్‌గా కూడా రాణించగలడు’’ అని విక్రమ్ రాథోర్ అన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు.

ఇక రింకూ సింగ్‌తో పాటు యంగ్ క్రికెటర్లు అయిన శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్‌లను కూడా అన్ని ఫార్మాట్లలోకి తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. అద్భుతమైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారని, అయితే గిల్, జైస్వాల్ మూడు ఫార్మాట్లలో ఎక్కువ కాలం ఆడేలా కనిపిస్తున్నారని, రాబోయే సంవత్సరాల్లో వీరిద్దరూ భారత బ్యాటింగ్‌కు వెన్నెముకగా మారబోతున్నారని రాథోర్ అభిప్రాయపడ్డారు.

రింకూ సింగ్ ట్రాక్ రికార్డు ఇదే
రింకూ సింగ్ ఇప్పటివరకు భారత్ తరఫున 2 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. టీ20లల రింకూ సింగ్ స్ట్రైక్-రేట్ 176.27గా ఉంది. ఇక 15 మ్యాచ్‌ల్లో 83.2 సగటుతో 416 పరుగులు బాదాడు. జట్టులో ఫినిషర్ పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా ఆడాడు. జూన్‌ నెలలో వెస్టిండీస్‌, అమెరికాల వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్‌ జట్టులో రిజర్వ్‌ ఆటగాడిగా కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రింకూ సింగ్ ఇప్పటివరకు 47 మ్యాచ్‌లు ఆడాడు. 7 సెంచరీలు, 20 అర్ధసెంచరీలతో కలుపుకొని 54.7 సగటుతో మొత్తం 3,173 పరుగులు సాధించాడు. కాగా భారత బ్యాటింగ్ కోచ్‌గా రాథోర్ పదవీకాలం టి20 ప్రపంచ కప్‌తో ముగిసిపోయింది.

  • Loading...

More Telugu News