Muchumarri Incident: ముచ్చుమర్రిలో బాలిక హత్య ఘటనపై ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వివరణ

Nandyal SP Adhiraj Singh press meet over a girl murder case

  • నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికపై హత్యాచారం
  • పార్కు సమీపంలో బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేశారన్న ఎస్పీ
  • ఊరి బయటికి తీసుకెళ్లి బాలికను గొంతు నులిమి చంపారని వెల్లడి

నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో వాసంతి అనే బాలిక హత్యకు గురవడం తెలిసిందే. జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తాజాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. 

పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో చిన్నారి వాసంతిపై పార్కు సమీపంలో ముగ్గురు బాలురు అత్యాచారం చేశారని వెల్లడించారు. అనంతరం ఊరి బయటకు తీసుకెళ్లి బాలిక గొంతు నులిమి హత్య చేశారని వివరించారు. 

ఘటన తర్వాత ఈ విషయాన్ని నిందితులు తమ కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పారని ఎస్పీ వెల్లడించారు. దాంతో తమ పిల్లలను కాపాడుకునేందుకు నిందితుల్లో ఒకరి తండ్రి, మరొకరి పెదనాన్న రంగంలోకి దిగారని తెలిపారు.

వారిద్దరూ బాలిక మృతదేహాన్ని బైక్ పై వనములపాడుకు తీసుకెళ్లారని, అక్కడ్నించి చిన్న తెప్పపై కృష్ణానదిలోకి తీసుకెళ్లి, మృతదేహానికి రాళ్లు కట్టి నదిలో పడేశారని వివరించారు.

బాలిక మృతదేహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ముచ్చుమర్రి రాజకీయాలతో బాలిక వాసంతి హత్య ఘటనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. బాలురు ఓ యూట్యూబ్ వీడియో చూసి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు ఎస్పీ వివరించారు.

  • Loading...

More Telugu News