Signal Jumping: అంబులెన్స్ కు దారిచ్చే క్రమంలో వాహనదారులు సిగ్నల్ జంప్ చేసినా నో ఫైన్... ఎక్కడంటే..!
రోగులను అత్యవసరంగా తరలించే అంబులెన్స్ లు రోడ్లపైకి వస్తే... ఎంతటి ట్రాఫిక్ లో కూడా దారి ఇస్తారు. ప్రాణాలకు సంబంధించిన అంశం కావడంతో, ఆ సమయంలో ట్రాఫిక్ నిబంధనలన్నీ పక్కనబెట్టేస్తారు. ఈ నేపథ్యంలో, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు మహానగరంలో అంబులెన్స్ కు దారి ఇచ్చే క్రమంలో... వాహనదారులు సిగ్నల్ జంపింగ్ చేస్తే ఇకపై జరిమానా విధించకూడదని నిర్ణయించారు.
ఒకవేళ, అంబులెన్స్ కు దారి ఇచ్చే క్రమంలో సిగ్నల్ జంపింగ్ చేసిన వారికి ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాల ద్వారా జరిమానా విధిస్తే... ఆ వాహనదారులు ఇన్ ఫాంట్రీ రోడ్ లో ఉన్న ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సెంటర్ ను సంప్రదించాలని బెంగళూరు ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ తెలిపింది. అంతేకాదు, కర్ణాటక స్టేట్ పోలీస్ (కేఎస్ పీ) యాప్ ద్వారా కూడా తమ జరిమానా విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురావొచ్చని వివరించింది.
కాగా, అంబులెన్స్ లు ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు చేరుకున్న సమయంలో సిగ్నల్ లైటు ఆటోమేటిగ్గా ఎరుపు రంగు నుంచి ఆకుపచ్చ రంగులోకి మారేలా జియో ఫెన్సింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ మేరకు 80 అంబులెన్స్ లకు జీపీఎస్ ను అమర్చారు.