Ponguleti Srinivas Reddy: రూ.7 లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti says congress formed government with 7 lakh crore debts

  • అప్పుల సాకును చూపి సంక్షేమంపై వెనుకడుగు వేసేది లేదని వ్యాఖ్య
  • పదేళ్లు పాలించిన ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించలేదని విమర్శ
  • గ్రామాలను తీర్చిదిద్దే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్న మంత్రి

రూ.7 లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అయినా, అప్పుల సాకును చూపి సంక్షేమంపై వెనుకడుగు వేసేది లేదన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పదేళ్లపాటు పాలించిన ప్రభుత్వం గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా మౌలిక వసతులపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయన్నారు.

పేదవారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వీలైనంత తొందరగా నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న గత ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గ్రామాలను తీర్చిదిద్దే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయని అప్రమత్తం చేశారు. గ్రామాల్లో ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

జ్వరాల విషయమై అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారన్నారు. రైతు భరోసా వంటి పథకాలపై కేబినెట్ స్థాయిలో నిర్ణయాలు తీసుకోకుండా నేరుగా రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టే కుట్రలు బీఆర్ఎస్ చేస్తోందని మండిపడ్డారు. వ్యవసాయం ఆదాయంపై ఆదాయపు పన్ను కట్టే పరిస్థితిలో రైతు లేడన్నారు.

  • Loading...

More Telugu News