Ponnam Prabhakar: వనమహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. జిల్లాల్లో 43 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని సూచించారు. ఇది అందరి జీవితంలో అలవాటు కావాలన్నారు. ప్రభుత్వం మొక్కలు పంపిణీ చేస్తోందని... కానీ ఇందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. కాలుష్యం తగ్గాలంటే, వ్యాధులు దరి చేరవద్దంటే అందరూ చెట్లు పెంచడంపై దృష్టి సారించాలన్నారు. ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయాలన్నారు. దీనిని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా సామాజిక కార్యక్రమంగా చేపట్టాలన్నారు.