BCCI: టీమిండియా మా దేశంలో ఆడకపోతే మేం కూడా భారత్ లో ఆడం: పీసీబీ
- వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా స్వదేశంలోనే నిర్వహించాలన్న పట్టుదలతో వున్న పాక్
- హైబ్రీడ్ మోడల్ ను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
- భారత్ పాల్గొనకపోతే 2026లో శ్రీలంకతోపాటు భారత్ లో జరిగే టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనబోమని హెచ్చరిక
- ఈ నెల 19 నుంచి 22 వరకు కొలంబోలో జరగనున్న ఐసీసీ వార్షిక సదస్సు
వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. మ్యాచ్ లన్నింటినీ స్వదేశంలోనే నిర్వహించాలని గట్టి పట్టుదలతో ఉంది. హైబ్రీడ్ మోడల్ లో మ్యాచ్ ల నిర్వహణను కొట్టిపారేస్తోంది. ఈ నెల 19 నుంచి 22 వరకు కొలొంబోలో జరిగే ఐసీసీ వార్షిక సదస్సులో హైబ్రీడ్ మోడల్ కు సంబంధించి ఏవైనా ప్రతిపాదనలు వస్తే వాటిని వ్యతిరేకించనుంది. ఈ మేరకు పాక్ కు చెందిన జియో న్యూస్ ఓ కథనం వెలువరించింది.
ఆ కథనం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా తమ దశంలో పర్యటించేందుకు నిరాకరిస్తే 2026లో శ్రీలంకతో కలిసి భారత్ నిర్వహించే టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనబోమని పీసీబీ హెచ్చరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాను పాక్ కు పంపేందుకు బీసీసీఐ సుముఖంగా లేదన్న వార్తల నేపథ్యంలో పీసీబీ ఈ వైఖరి అనుసరించనుంది.
గతంలో ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో 2008లో పాక్ లో జరిగిన ఆసియా కప్ తర్వాత టీమిండియా ఆ దేశంలో పర్యటించలేదు. అలాగే అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగడంలేదు. ప్రపంచ కప్ లాంటి ఐసీసీ టోర్నమెంట్లలో లేదా తటస్థ వేదికలపై జరిగే ఆసియా కప్ టోర్నమెంట్లలో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయి. వచ్చే ఏడాది పాక్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మ్యాచ్ లను తటస్థ వేదికలపై ఆడేలా హైబ్రీడ్ మోడల్ ను అమలు చేయాలని ఐసీసీని కోరతామని బీసీసీఐ ఇటీవల సంకేతాలిచ్చింది.
గతేడాది పాక్ నిర్వహించిన ఆసియా కప్ కోసం ఆ దేశంలో టీమిండియా పర్యటించేందుకు బీసీసీఐ నిరాకరించడంతో చివరకు హైబ్రీడ్ మోడల్ ను అనుసరించారు. అయితే దీనివల్ల పాకిస్థాన్ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించే అకాశం కోల్పోయింది. అందుకే వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా స్వదేశంలోనే నిర్వహించాలని పీసీబీ పట్టుదలగా ఉంది.