World Championship of Legends 2024: ఫైనల్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం.. లెజెండ్స్ ట్రోఫీ కూడా మనదే
- ఫైనల్‌లో పాకిస్థాన్‌ను మట్టికరిపించిన యువీ సేన
- అర్ధ సెంచరీతో అలరించిన అంబటి రాయుడు
- 5 వికెట్ల తేడాతో విజయం
ఇటీవల టీ20 ప్రపంచకప్ సొంతం చేసుకున్న భారత్‌కు తాజాగా మరో కప్పు చేజిక్కింది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత చాంపియన్స్ జట్టు ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి కప్పును కైవసం చేసుకుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లీగ్స్ 2024 ఫైనల్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో షోయబ్ మాలిక్ ఒక్కడే భారత బౌలర్లను ఎదురొడ్డి 36 బంతుల్లో 3 సిక్సర్లతో 41 పరుగులు చేయగలిగాడు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు తీసుకున్నాడు.
అనంతరం 157 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అంబటి రాయుడు 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ (50) సాధించాడు. గురుకీరత్‌సింగ్ మన్ 34, యూసుఫ్ పఠాన్ 30 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో ఆమీర్ యామిన్ రెండు వికెట్లు పడగొట్టాడు.