Team India: కుప్పకూలిన జింబాబ్వే... గెలుపుతో టూర్ ముగించిన టీమిండియా

Team Indian concludes Zimbabwe tour with win
  • చివరిదైన ఐదో టీ20లో టీమిండియా ఘనవిజయం
  • 168 పరుగుల ఛేజింగ్ లో 125 పరుగులకు జింబాబ్వే ఆలౌట్
  • సిరీస్ ను 4-1తో కైవసం చేసుకున్న టీమిండియా
జింబాబ్వేతో ఆఖరి టీ20 మ్యాచ్ లో టీమిండియా 42 పరుగులతో ఘనవిజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన ఆతిథ్య జింబాబ్వే జట్టును టీమిండియా బౌలర్లు 18.3 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూల్చారు. ముఖ్యంగా, పేసర్ ముఖేశ్ కుమార్ 4 వికెట్లతో జింబాబ్వేను దెబ్బతీశాడు. శివమ్ దూబే 2, తుషార్ దేశ్ పాండే 1, వాషింగ్టన్ సుందర్ 1, అభిషేక్ శర్మ 1 వికెట్ తీశారు. 

జింబాబ్వే ఇన్నింగ్స్ లో డియాన్ మైర్స్ 34, తదివనాషే మరుమని 27, ఫరాజ్ అక్రమ్ 27 పరుగులు చేశారు. ఓపెనర్ వెస్లీ మదివెరే (0) డకౌట్ కాగా... కెప్టెన్ సికిందర్ రజా (8), బ్రయాన్ బెన్నెట్ (10), జోనాథన్ క్యాంప్ బెల్ (4), వికెట్ కీపర్ క్లైవ్ మడాండే (1) విఫలమయ్యారు. 

ఈ విజయంతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 4-1తో చేజిక్కించుకుంది. అంతేకాదు, గెలుపుతో జింబాబ్వే పర్యటనను ముగించింది. శుభ్ మాన్ గిల్ సారథ్యంలోని యువ టీమిండియా జట్టు ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో ఓటమిపాలైనప్పటికీ... ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్ ల్లో విజయాలు సాధించడం విశేషం. 

టీమిండియా తదుపరి పర్యటన శ్రీలంకలో జరగనుంది. టీమిండియా ఈ నెల 27 నుంచి శ్రీలంకలో టీ20 సిరీస్, ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్ ఆడనుంది.
Team India
Zimbabwe
T20 Series
Victory

More Telugu News