Donald Trump: ట్రంప్ పై కాల్పులు జరిపింది ఇతడే.. ఫొటో ఇదిగో!

Thomas Matthew Crooks The Man Who Tried To Assassinate Donald Trump

  • నిందితుడు బెతెల్ పార్క్ కు చెందిన థామస్ మాథ్యూ క్రూక్స్ గా గుర్తింపు
  • రిపబ్లికన్ మద్దతుదారుడేనని తేల్చిన పోలీసులు
  • 2021 లో డెమోక్రటిక్ పార్టీకి 15 డాలర్ల విరాళం ఇచ్చిన క్రూక్స్

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. సీక్రెట్ సర్వీస్ పోలీసులు వెంటనే స్పందించి తిరిగి కాల్పులు జరపడంతో నిందితుడు చనిపోయాడు. ట్రంప్ పై కాల్పులు జరిపింది ఎవరనే విషయాన్ని అమెరికా పోలీసులు వెల్లడించారు. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్ కు చెందిన థామస్ మాథ్యూ క్రూక్స్ గా గుర్తించామని పేర్కొన్నారు. క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుడేనని తెలిపారు.

అయితే, 2021లో క్రూక్స్ డెమోక్రటిక్ పార్టీ అనుబంధ సంస్థ ప్రోగ్రెసివ్ టర్నౌట్ ప్రాజెక్టుకు 15 డాలర్లు విరాళం ఇచ్చాడని బయటపెట్టారు. నిందితుడి ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. బెతెల్ పార్క్ లోని క్రూక్స్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆ ఇల్లు ఉన్న వీధిలోకి ఎవరినీ అనుమతించడంలేదు. 

కాల్పులకు ముందు సెల్ఫీ వీడియో..?
డొనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరపడానికి ముందు నిందితుడు క్రూక్స్ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ‘రిపబ్లికన్ పార్టీని, ట్రంప్ ను ద్వేషిస్తున్నా’ అంటూ క్రూక్స్ చెబుతున్నాడు. 

సమాచారం ఉంటే మాకు చెప్పండి.. ఎఫ్ బీఐ
కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) తెలిపింది. ట్రంప్ ర్యాలీకి హాజరైన వారిలో ఎవరికైనా ఈ ఘటనకు సంబంధించిన సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని కోరింది. కాల్పులు జరిపిన ప్రాంతాన్ని ఇంకా అనుమానిత స్థలంగానే పరిగణిస్తున్నట్లు ఎఫ్ బీఐ అధికారులు చెప్పారు. ఘటనా స్థలంలో అనుమానిత ప్యాకేజీలను గుర్తించామని, అవి పేలుడు పదార్థాలని అనుమానిస్తున్నట్లు తెలిపారు.

ట్రంప్ కు బైడెన్ ఫోన్ కాల్..
కాల్పుల ఘటన తర్వాత ట్రంప్ కు ప్రెసిడెంట్ బైడెన్ ఫోన్ చేశారని, ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. వీకెండ్ కావడంతో డెలావెర్ లోని తన నివాసానికి వెళుతుండగా కాల్పుల విషయం తెలిసి బైడెన్ వాపస్ వచ్చేశారని వివరించింది. ఈ ఘటనకు సంబంధించిన దర్యాఫ్తు వివరాలను ప్రెసిడెంట్ బైడెన్ వైట్ హౌస్ నుంచి పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది.

More Telugu News