Space X: ఆకాశం నుంచి కుప్పకూలనున్న 20 ఉపగ్రహాలు!

20 Satellites To Crash On Earth As SpaceX Rocket Leaves Them In Wrong Orbit

  • నిర్ధారించిన ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్
  • ప్రయోగ సమయంలో చోటుచేసుకున్న సాంకేతిక లోపం వల్లేనని ప్రకటన
  • విఫలమైన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం

ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ కు చెందిన సొంత సంస్థ, ప్రైవేటు అంతరిక్ష కంపెనీ స్సేస్ ఎక్స్ తాజాగా చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఒకేసారి 20 ఉపగ్రహాలను భూ కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు స్పేస్ ఎక్స్ ఈ ప్రయోగం చేపట్టింది. కానీ సాంకేతక లోపం కారణంగా నిర్దేశిత కక్ష్యలో  కాకుండా దానికన్నా తక్కువ కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించాయి. దీంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. త్వరలోనే అవి భూమివైపు దూసుకొచ్చి కుప్పకూలనున్నాయి. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా ప్రకటించింది. 

‘గురువారం రాత్రి ప్రయోగం మొదలైన కాసేపటికి ఫాల్కన్ 9 రాకెట్ రెండో దశ ఇంజన్ రెండోసారి మండటం పూర్తిస్థాయిలో జరగలేదు. ఫలితంగా నిర్దేశిత కక్ష్యకన్నా తక్కువ ఎత్తులోనే అవి మోహరించాయి. మొత్తం 20 శాటిలైట్లకుగాను 10 శాటిలైట్లతో మా బృందం కాంటాక్ట్ కాగలిగింది. వాటి ఎత్తు పెంచేలా చేసేందుకు ప్రయత్నించింది. కానీ అధి సాధ్యపడలేదు. ఈ ఉపగ్రహాలన్నీ భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి పూర్తిగా నశిస్తాయి. వాటి వల్ల ప్రస్తుతం కక్ష్యలో తిరిగే ఇతర ఉపగ్రహాలకు లేదా మనుషులకు ఎలాంటి ముప్పు లేదు’ అంటూ వేర్వేరు పోస్ట్ లలో స్పేస్ ఎక్స్ తెలిపింది.

అంతకుముందు ఎలాన్ మస్క్ సైతం దీనిపై ‘ఎక్స్’లో స్పందించారు. శాటిలైట్లలోని సాఫ్ట్ వేర్ ను అప్ డేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కానీ ఇదేమీ ‘స్టార్ ట్రెక్’ ఎపిసోడ్ కానందున ఈ ప్రయత్నం సఫలమయ్యే అవకాశం లేదని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

More Telugu News