Vinod Kumar: పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను చూసి బాధపడాల్సిన పనిలేదు: వినోద్ కుమార్

Vinod Kumar about MLAs who joining congress

  • నాడు బీఆర్ఎస్‌లో, నేడు కాంగ్రెస్‌లో చేరినప్పుడు అభివృద్ధి కోసమే అంటున్నారని విమర్శ
  • నిత్యం పార్టీ మారే వారిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న వినోద్ కుమార్
  • కేసీఆర్ కొత్త తరం నేతలను ప్రోత్సహిస్తారన్న మాజీ ఎంపీ
  • రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని వ్యాఖ్య

పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలను చూసి బాధపడాల్సిన పనిలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ అన్నారు. నాడు బీఆర్ఎస్‌లో చేరినప్పుడు అభివృద్ధి కోసమే చేరుతున్నట్లు చెప్పారని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరినప్పుడూ అదే మాట చెబుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిత్యం పార్టీలు మారే వారిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. వాళ్లు తిరిగి వస్తామన్నా ప్రజలు రానివ్వరని పేర్కొన్నారు. త్వరలో పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసుకుందామన్నారు. కొత్త తరం నేతలను కేసీఆర్ ప్రోత్సహిస్తారన్నారు.

బీఆర్ఎస్ ఓటమిపై ఆయన స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అన్నారు. కొన్నిసార్లు కొన్ని కారణాలతో ఓడిపోతుండవచ్చునని వ్యాఖ్యానించారు. వచ్చే ఐదేళ్ల తర్వాత బీఆర్‌ఎస్‌ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంలో టీడీపీ, జేడీయూ సహకారంతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. చంద్రబాబు ఇటీవల ఢిల్లీకి వెళ్లి విభజన చట్టంలోని అంశాలపై మాట్లాడారని గుర్తు చేశారు. ఆ తర్వాత షెడ్యూల్ 13లో ఉన్న పెట్రో, కెమికల్, ఆయిల్ రిఫైనరీ హబ్ ఏపీకి ఇస్తున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. ఇదే షెడ్యూల్ 13లో తెలంగాణకు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఉందని గుర్తు చేశారు.

ఏపీకి పెట్రో కెమికల్ రిఫైనరీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కానీ తెలంగాణకు రావాల్సిన వాటిని ఇవ్వాలన్నారు. చంద్రబాబుపై కేంద్రం ఆధారపడినందువల్లే ఆయన అడిగినవి ఇచ్చిందన్నారు. తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచినా మొండిచేయి చూపిస్తోందని విమర్శించారు. తెలంగాణకు ఐటీఐఆర్, కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వలేదన్నారు.

  • Loading...

More Telugu News