Delhi Liquor Scam: మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- సీబీఐ కేసులో కస్టడీని పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
- జులై 25వ తేదీ వరకు కస్టడీని పొడిగించిన న్యాయస్థానం
- ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ జైల్లోనే కేజ్రీవాల్
మద్యం పాలసీకి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆయన కస్టడీని జులై 25 వరకు పొడిగించింది.
ఈడీ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన కొంతసేపటికే సీబీఐ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. బెయిల్ లభించినప్పటికీ సీబీఐ కేసులోనూ ఆయన అరెస్టయ్యారు కాబట్టి... తీహార్ జైల్లోనే ఉండనున్నారు.
ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే జూన్ 26న సీబీఐ... కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. రద్దు చేయబడిన ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారులలో ఒకరు అని సీబీఐ తన ఛార్జిషీట్లో ఆరోపించింది. కేజ్రీవాల్‌కు సన్నిహితుడైన ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మీడియా ఇంఛార్జ్ విజయ్ నాయర్ పలువురు మద్యం తయారీదారులు, వ్యాపారులతో టచ్‌లో ఉన్నారని, వారికి అనుకూలంగా నిబంధనలు సిద్ధం చేశారని పేర్కొంది.