Fatal Car Crash: రీల్స్ పిచ్చితో మద్యం మత్తులో కారుతో విన్యాసాలు.. మహారాష్ట్రలో ఇద్దరి దుర్మరణం

Video Reveal Moments Before Fatal Car Crash In Nagpur

  • నాగ్ పూర్ లో బోల్తాపడి కొద్దిదూరం ఈడ్చుకెళ్లిన కారు
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన మరో ముగ్గురు
  • అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమన్న పోలీసులు

మద్యం మత్తులో రీల్స్ కోసం చేసిన ప్రయత్నం ఇద్దరు యువకుల ప్రాణాలను బలితీసుకుంది.. మరో ముగ్గురిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. మంగళవారం తెల్లవారుజామున నాగ్ పూర్ లో జరిగిన కారు ప్రమాదం వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఐదుగురు యువకులు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా రోడ్డు పక్కనే ఉన్న బారియర్ ను ఢీ కొట్టడం కనిపిస్తోంది.

నాగ్ పూర్ లోని పంజారా గ్రామ సమీపంలో చోటుచేసుకుందీ ప్రమాదం. కారులోని యువకులంతా మద్యం మత్తులో ఉన్నారని, రీల్స్ కోసం కారును అతివేగంగా, అడ్డదిడ్డంగా నడిపారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి బోల్తా పడిందన్నారు. బోల్తా పడిన చోటు నుంచి కొన్ని మీటర్ల మేర ఈడ్చుకుపోయిందని చెప్పారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుగా మారిందన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్ లోనే చనిపోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదం సంగతి తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బందితో కలిసి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి సీరియస్ గానే ఉందని వైద్యులు చెప్పారన్నారు.

More Telugu News