Maharashtra: ఉద్యోగంలో జాయిన్ అవడానికి ముందే ఇల్లు, కారు కావాలన్న ట్రైనీ ఐఏఎస్.. ప్రభుత్వం సీరియస్!

Trainee IAS Officer Puja Khedkar Wanted House Car Before Joining

  • మహారాష్ట్రలో ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ అధికార దర్పం
  • ఇప్పటికే సొంత కారుకు సైరన్, వీఐపీ నంబర్ ప్లేట్లు, ప్రభుత్వ స్టిక్కర్ అంటించిన వైనం
  • పూణే కలెక్టర్ ఫిర్యాదుతో వాసిమ్ కు బదిలీ చేసిన ప్రభుత్వం

మహారాష్ట్రలో ప్రొబేషన్ లో ఉన్న పూజా ఖేడ్కర్ అనే ట్రైనీ ఐఏఎస్ అధికారి దర్పానికి సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూణే అసిస్టెంట్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోక ముందే తనకు విడిగా ఓ ఇల్లు, కారు కావాలని ఆమె డిమాండ్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2023 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె ఇప్పటికే తన సొంత కారుకు సైరన్, వీఐపీ నంబర్ ప్లేట్లు, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్ అంటించుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 

పూణే అదనపు కలెక్టర్ అజయ్ మోరే బయటకు వెళ్లినప్పుడు ఆయన కార్యాలయాన్ని ఆమె ఉపయోగించుకున్నట్లు కూడా విమర్శలు ఉన్నాయి. అందులోని ఆఫీసు ఫర్నిచర్ ను, ఆయన నేమ్ ప్లేట్ ను తొలగించిన ఖేడ్కర్.. తనకు అధికారిక లెటర్ హెడ్ లు కావాలని పట్టుబట్టినట్లు కూడా సమాచారం. ప్రొబేషన్ లో ఉన్న జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలేవీ ప్రభుత్వం కల్పించదు. 24 నెలల ప్రొబేషన్ కాలం ముగిశాకే వాటిని అందిస్తారు. కానీ ఆమె తండ్రి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దిలీప్ ఖేడ్కర్ సైతం తన కుమార్తెకు ఈ సౌకర్యాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పూణే కలెక్టర్ సుహాస్ దివాసే ఆమెపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం పూజా ఖేడ్కర్ ను వాసిమ్ కు బదిలీ చేసింది. 

వాస్తవానికి పూజా ఖేడ్కర్ ను యూపీఎస్సీ ఎంపిక చేయడంపైనా వివాదం కొనసాగుతోంది. పాక్షిక అంధత్వం, మనోవైకల్యంతో బాధపడుతున్నట్లు కాగితాలు సమర్పించిన పూజా ఖేడ్కర్ ఆ కోటాలో యూపీఎస్ సీ ఎంపిక ప్రక్రియలో సెలక్టయ్యారు. కానీ ఇందుకు సంబంధించి తప్పనసరి వైద్య పరీక్షలు ఎదుర్కొనేందుకు మాత్రం నిరాకరించారు. వైద్య పరీక్షలకు హాజరు కావాలన్న నోటీసులను ఐదుసార్లు పట్టించుకోని ఖేడ్కర్.. ఆరోసారి పాక్షికంగానే వైద్య పరీక్షలకు హాజరయ్యారు. దృష్టి లోపానికి సంబంధించి ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్షకు గైర్హాజరయ్యారు. ఓ ప్రైవేటు సంస్థ నుంచి ఎంఆర్ ఐ నివేదికను తీసుకొచ్చి సమర్పించారు. దీంతో ఆమె ఎంపికను యూపీఎస్ సీ... సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (క్యాట్)లో సవాల్ చేసింది. 2023 ఫిబ్రవరిలో క్యాట్ ఆమెకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఆమె పోస్టింగ్ తెచ్చుకున్నారు.

పూజా ఖేడ్కర్ ఓబీసీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్ ను సమర్పించడంపైనా వివాదం కొనసాగుతోంది. ఆమె తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ దిలీప్ ఖేడ్కర్ పేరిట రూ. 40 కోట్లు, తల్లి మనోరమ పేరిట రూ. 15 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింది. అలాగే జాయినింగ్ కు ముందు తన పేరిట రూ. 17 కోట్ల విలువైన స్థిరాస్తులు, వాటిపై రూ. 43 లక్షల వార్షికాదాయం వస్తున్నట్లు యూపీఎస్ కి సమర్పించిన డిక్లరేషన్ లో పూజా వెల్లడించారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో ఆమె తండ్రి వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ తరఫున పోటీ చేశారు. యూపీఎస్ సీ పరీక్షల్లో పూజా ఖేడ్కర్ ఆలిండియా స్థాయిలో 841 ర్యాంక్ సాధించారు.

More Telugu News