Bahishkarana: కింగ్ నాగార్జున చేతుల మీదుగా ‘బహిష్కరణ’ ట్రైలర్ విడుదల
- అంజలి ప్రధాన పాత్రలో బహిష్కరణ వెబ్ సిరీస్
- ముఖేశ్ ప్రజాపతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'బహిష్కరణ'
- ట్రైలర్ విడుదల చేసి వెబ్ సిరీస్ బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన నాగార్జున
- జులై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్
అనేక చిత్రాల్లో హీరోయిన్‌గానూ, విలక్షణ పాత్రల్లోనూ మెప్పించిన నటి అంజలి. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్స్‌పై రూపొందుతోన్న వెబ్ సిరీస్ ‘బహిష్కరణ’. దర్శకుడు ముఖేష్ ప్రజాపతి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విలేజ్ రివెంజ్ డ్రామా జానర్‌లో రూపొందుతోన్న ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ వెబ్ సిరీస్ జులై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను టాలీవుడ్ కింగ్ నాగార్జున విడుదల చేశారు. వెబ్ సిరీస్ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. 'బహిష్కరణ' ట్రైలర్ రిలీజ్ చేయడం థ్రిల్లింగ్ గా అనిపించిందని వెల్లడించారు. బిగ్ బాస్ రియాలిటీ షో సమయంలోనే ముఖేశ్ ప్రజాపతి పనితీరు తనను ఆకట్టుకుందని, ఈ వెబ్ సిరీస్ తో ఇంకా ఆకట్టుకున్నాడని నాగ్ తెలిపారు. అంజలి ఇందులో మంచి అభినయం కనబర్చిందని, పుష్ప క్యారెక్టర్ కు జీవం పోసిందని కొనియాడారు.
ట్రైలర్‌ను గమనిస్తే.. "మంచోడు చేసే తప్పేంటో తెలుసా... చెడ్డోడి చరిత్ర గురించి తెలుసుకోవటం" అనే డైలాగ్‌తో ప్రారంభమైంది. ఓ వైపు పచ్చటి పల్లెటూరు, అక్కడ అంజలి, శ్రీతేజ్, అనన్య నాగళ్ల పాత్రల మధ్య సన్నివేశాలను అందంగా చూపిస్తూనే, పల్లెటూరులో ఊరి పెద్ద, అతని మనుషులు చేసే దురాగతాలను చూపించారు.
అలాంటి పల్లెటూర్లోకి పుష్ప అనే అమ్మాయి వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులు మారుతాయి. ఇంతకీ పుష్ప అక్కడికెందుకు వచ్చింది... ఊరి పెద్దతో ఆమెకున్న రిలేషన్ ఏంటి? అమ్మాయిలను ఆటవస్తువులుగా చూసింది ఎవరు? ఇలాంటి ఎన్నెన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే 'బహిష్కరణ' వెబ్ సిరీస్ చూడాల్సిందే. పుష్ప పాత్రలో అంజలి, ఊరిపెద్ద పాత్రలో రవీంద్రన్ విజయ్, యువ జంటగా శ్రీతేజ్, అనన్య నాగళ్ల నటించారు.