Stock Market: స్టాక్ మార్కెట్ జోరుకు బ్రేక్... నేడు నష్టాలతో ముగిసిన సూచీలు
- వరుస లాభాలకు అడ్డుకట్ట
- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు
- లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
గత కొన్ని రోజులుగా వరుసగా లాభాలతో సరికొత్త జీవితకాల గరిష్ఠాలను అందుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. నేడు సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. అయితే, కాసేపటికే ట్రెండ్ మారింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో స్టాక్ మార్కెట్ సూచీలు పతనమయ్యాయి. చివరికి 426.87 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 79,924.77 వద్ద ముగిసింది. 108.75 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 24,324.45 వద్ద స్థిరపడింది.
ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ లైఫ్, దివీస్ ల్యాబ్స్, బ్రిటానియా, గ్రాసిమ్ షేర్లు లాభాలు అందుకోగా... మహీంద్రా అండ్ మహీంద్రా, హిండాల్కో, టాటా స్టీల్, టీసీఎస్, హెచ్ సీఎల్ టెక్ నష్టాలు చవిచూశాయి.