Nimmala Rama Naidu: పట్టిసీమ వట్టి సీమ అన్న జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలి: మంత్రి నిమ్మల రామానాయుడు

Nimmala Ramanaidy demands Jagan must apologise farmers
  • నేడు కృష్ణా పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు
  • జగన్ పాలనలో నీటిపారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శలు
  • చింతలపూడి, పులిచింతల ప్రాజెక్టులను వైసీపీ పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం 
ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు ప్రకాశం బ్యారేజి నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు, తాగు నీరు విడుదల చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని కృష్ణా డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణా నదికి పూజలు చేశారు. డెల్టా రెగ్యులేటర్ నుంచి గేట్లు తెరిచి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ... వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడం తమ లక్ష్యం అని వెల్లడించారు. జగన్ హయాంలో నీటిపారుదల శాఖను 20 ఏళ్ల వెనక్కి లాగారని విమర్శించారు. పట్టిసీమ వట్టిసీమ అన్న జగన్ రైతులకు క్షమాపణలు చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలోనే సాగునీటికి అత్యంత ప్రాధాన్యం లభించిందని వివరించారు. 

చింతలపూడి ప్రాజెక్టును వైసీపీ పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఐదేళ్లపాటు పూడిక తీయకపోవడంతో రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. కాలువల నిర్వహణ పనులు ఫిబ్రవరి, మార్చిలో చేసేట్టు జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. 

అటు, పులిచింతల సైతం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎండిపోయిందని మంత్రి నిమ్మల మండిపడ్డారు. 40 టీఎంసీలు ఉండాల్సిన చోట అర టీఎంసీ కూడా నీటి నిల్వ లేదని అన్నారు. చివరి ఎకరాకు కూడా నీళ్లు ఇచ్చేంత వరకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని స్పష్టం చేశారు.
Nimmala Rama Naidu
Krishna Delta
Water
Jagan
Patti Seema
TDP
YSRCP

More Telugu News